- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్ ఆశయాలకు జ్ఞాన సౌధాలు
సామాజిక న్యాయం, అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ టవర్, బాబు జగ్జీవన్‌రామ్ విద్యార్థి వసతి గృహ నిర్మాణాలు మైలురాళ్లుగా నిలవనున్నాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో : సామాజిక న్యాయం, అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ టవర్, బాబు జగ్జీవన్‌రామ్ విద్యార్థి వసతి గృహ నిర్మాణాలు మైలురాళ్లుగా నిలవనున్నాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, విద్య ద్వారానే సమాజంలో అణగారిన వర్గాలు నాయకత్వ స్థానాలకు చేరుకోగలవని ఆయన స్పష్టం చేశారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లో ప్రతిపాదిత అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ నిర్మాణ స్థలాన్ని, అనంతరం నింబోలీఅడ్డాలో ఆధునికీకరించనున్న బాబు జగ్జీవన్‌రామ్ విద్యార్థి వసతి గృహ స్థలాన్ని సోమవారం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ కేవలం ఇటుకలు, సిమెంట్‌తో నిర్మించే భవనం కాదని, కోట్లాది మంది దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల యువత భవిష్యత్తును తీర్చిదిద్దే విజ్ఞాన సౌధమని పేర్కొన్నారు. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పది అంతస్తుల్లో నిర్మించనున్న ఈ టవర్‌లో డిజిటల్ లైబ్రరీలు, ఈ-లెర్నింగ్ సెంటర్లు, పరిశోధన విభాగాలు, పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలు, కాన్ఫరెన్స్ హాళ్లు, కెరీర్ గైడెన్స్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా నగర విద్యార్థులతో సమానంగా అవకాశాలు పొందేలా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేసి, హైదరాబాద్‌లోని నిష్ణాతులైన అధ్యాపకుల బోధనను ప్రత్యక్షంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అందించనున్నట్లు వెల్లడించారు.
సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వేలు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు అవసరమైన అత్యుత్తమ శిక్షణను పేద విద్యార్థులకు ఉచితంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య కోసం హైదరాబాద్‌కు రాలేని విద్యార్థులకు వారి ప్రాంతాల నుంచే ఉన్నత అవకాశాలను అందించే వ్యవస్థను ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు. నింబోలీ అడ్డాలోని చారిత్రాత్మక విద్యార్థి వసతి గృహాన్ని ప్రస్తావిస్తూ, ఇది కేవలం ఒక హాస్టల్ కాదని, వేలాది మంది పేద విద్యార్థుల కలలకు ఆశ్రయం కల్పించిన సామాజిక చరిత్రకు సజీవ సాక్ష్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇక్కడ నివసించిన విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలుగా ఎదిగి సమాజానికి సేవలందించారని గుర్తు చేశారు.
ప్రజా ప్రభుత్వం సంక్షేమాన్ని ఖర్చుగా కాకుండా సామాజిక పెట్టుబడిగా చూస్తోందని, సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల సమర్థ వినియోగం, హాస్టళ్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులు, విద్యా మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా ప్రభుత్వం తన నిబద్ధతను చాటుతోందన్నారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లో సుమారు రూ.110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, నిమ్బోలి అడ్డాలో సుమారు రూ.25 కోట్లతో అత్యాధునిక వసతులతో బాబు జగ్జీవన్‌రామ్ విద్యార్థి వసతి గృహాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నా హయాంలో ఈ రెండు చారిత్రాత్మక ప్రాజెక్టులకు నిధులు కేటాయించి కార్యరూపం దాల్చడం జీవితంలో గర్వకారణమైన ఘట్టం అని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ టవర్ ద్వారా ప్రతి సంవత్సరం వేలాది మంది యువతకు సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, పోలీస్, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ అందించడంతో పాటు డిజిటల్ లైబ్రరీలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, కెరీర్ కౌన్సెలింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఎమ్మెలల్సీ అద్దంకి దయాకర్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి, ఆర్ అండ్ బి సీఈ రాజేశ్వర్ రెడ్డి, ఎస్‌ఈ నర్సింగరావు, ఈఈ మనోహర్, ఆర్డీవో సాయిరాం, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.






