Crude Oil: హోర్ముజ్ జలసంధి మూసివేతపై టెన్షన్ లేదు

by S Gopi |

ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు పెంచుతున్నప్పటికీ, భారత్ ఇంధన భద్రత విషయంలో ఫుల్ సేఫ్‌గా ఉందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు.

Crude Oil: హోర్ముజ్ జలసంధి మూసివేతపై టెన్షన్ లేదు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు పెంచుతున్నప్పటికీ, భారత్ ఇంధన భద్రత విషయంలో ఫుల్ సేఫ్‌గా ఉందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' మూసివేత కొనసాగినా, మన దేశం ఆ సంక్షోభాన్ని సులభంగా తట్టుకోగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న ప్రభుత్వ అత్యవసర నిల్వలు, కంపెనీల వాణిజ్య నిల్వలు అన్నీ కలిపి దేశ అవసరాలకు 76 నుంచి 80 రోజులకు సరిపడా ఇంధన స్టాక్ అందుబాటులో ఉంది. ఒకవేళ సప్లై పూర్తిగా నిలిచిపోయినా కనీసం 30 రోజుల పాటు ఎలాంటి బ్రేకులు లేకుండా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అవసరాలను తీర్చగలమని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వంటి మిత్రదేశాల నుంచి అదనంగా ఎల్‌పీజీ సిలిండర్లను దిగుమతి చేసుకునేలా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు కూడా పూర్తి చేసిందన్నారు.

Next Story