- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజా దర్బార్‌లో వచ్చిన ప్రతి న్యాయబద్ధమైన సమస్యను పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, ఖమ్మం రూరల్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపించడమే ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజాదర్బార్‌లో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో 14 క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 15 డివిజన్లకు సంబంధించి చివరి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని, సుమారు 3,500 దరఖాస్తులకు పైగా వచ్చాయని తెలిపారు. చివరి దరఖాస్తు స్వీకరించే వరకు తాను స్వయంగా ఇక్కడే ఉండి ప్రజల వినతులు స్వీకరిస్తానని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాన ప్రాధాన్యంతో అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు.
పేదల సొంతింటి కలను సాకారం..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు ఇప్పటి వరకు 66 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. తొలి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, నిర్మాణ పురోగతికి అనుగుణంగా ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. రెండవ విడతలో ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి మరో 2 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. అనంతరం మూడవ, నాలుగవ విడతల్లో కూడా ఇళ్ల మంజూరు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
ప్రతి దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించి..
కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రతి అర్హులైన పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు 21,536 దరఖాస్తులు అందాయని, అందులో అత్యధికంగా 9,731 దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చాయని తెలిపారు. పెన్షన్ల కోసం సుమారు 4,700 దరఖాస్తులు, భూ సమస్యలకు 4 వేల దరఖాస్తులు, గృహజ్యోతి పథకం కోసం 900 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరగడం వల్లే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు. కొద్ది రోజుల్లో ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. రాబోయే నెల రోజుల్లో పాలేరు నియోజక వర్గ పరిధిలో భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ప్రజాదర్బార్‌లో వచ్చిన ప్రతి దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించి పరిష్కరించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, డి.ఎఫ్.ఓ. అనూజ్ అగర్వాల్, ఎదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ అనిత, వైస్ చైర్మెన్ నవీన్, మునిసిపల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.






