- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్రకు సీఎం కార్యాలయం నుంచి లేఖ పోలేదు.. రేవంత్ రెడ్డిపై బీజేపీ స్టేట్ చీఫ్ ఆరోపణలు
‘రేవంత్‌రెడ్డి.. ఇకనైనా కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌పై, బీజేపీ నాయకులపై నిరాధార ఆరోపణలు చేయడం మానండి’ అని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్. రాంచందర్‌రావు విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘రేవంత్‌రెడ్డి.. ఇకనైనా కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌పై, బీజేపీ నాయకులపై నిరాధార ఆరోపణలు చేయడం మానండి’ అని పార్టీ స్టేట్ చీఫ్ ఎన్. రాంచందర్‌రావు విమర్శించారు. సోమవారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. రైతు భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్, యువత హామీలు, ఎన్నికల గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టండి. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అబద్ధాలు, వ్యక్తిగత దూషణలు, తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేయకుండా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి’ అని అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవేనన్నారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని.. ప్రజల పక్షాన బీజేపీ తన పోరాటాన్ని మరింత బలంగా కొనసాగిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మనస్తత్వమే హిట్లర్ మనస్తత్వమని.. రాజ్యాంగం, రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ఆ పార్టీకి నమ్మకం లేదన్నారు. అందుకే ఇందిరాగాంధీ ఆనాడు దేశంలో ఎమర్జెన్సీ విధించారని.. ఇప్పుడు కూడా ఆ పార్టీని ఒకే కుటుంబం నడుపుతున్నదని విమర్శించారు. అధ్యక్షుడు ఎవరైనా నిర్ణయాలు మాత్రం ఒకే కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయన్నారు. అదే నియంతృత్వ ధోరణిని తెలంగాణలో సైతం అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తే జో హిట్లర్‌కి చాల్ చలేగా, ఓ హిట్లర్‌కి మౌత్ మరేగా అనే నినాదం గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. హిట్లర్ తరహా ఆలోచనలతో నడిచే ఏ రాజకీయ పార్టీ అయినా చివరికి ప్రజల తిరస్కారాన్నే ఎదుర్కొంటుందని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య కూడా ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తున్నదన్నారు. రేవంత్‌రెడ్డి.. ప్రధానమంత్రి, రాష్ట్రపతి గురించి మాట్లాడిన తీరు బాధాకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పేర్లు తప్ప మరో అంశం మాట్లాడటం లేదని అన్నారు. మోడీ సభ తర్వాత వచ్చిన నివేదికలతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతున్నదనే విషయం కాంగ్రెస్‌కు స్పష్టమైందని.. అందుకే బీజేపీపై అసహనం, ఆందోళన పెరిగిందని పేర్కొన్నారు.
మహారాష్ట్రకు సీఎం కార్యాలయం నుంచి లేఖ పోలేదు..
దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 104.41 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే, అందులో తెలంగాణ నుంచే 55.31 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం సేకరించిందని రాంచందర్‌రావు అన్నారు. ఎంఎస్పీ కింద దేశవ్యాప్తంగా రైతులకు చెల్లించిన మొత్తం సుమారు రూ.21,243 కోట్లు కాగా.. అందులో తెలంగాణ రైతులకు రూ.13,171 కోట్లకుపైగా చెల్లింపులు జరిగాయన్నారు. ఎంఎస్పీ ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య దేశవ్యాప్తంగా 11.69 లక్షల మంది కాగా, అందులో 7,79,358 మంది తెలంగాణ రైతులే ఉన్నారని తెలిపారు. మార్చి 25 నుంచే ప్రారంభం కావాల్సిన కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 25 వరకు రాష్ట్రం ప్రారంభించలేదని.. దాదాపు నెల రోజులకుపైగా రైతులను కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందిపెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రి నిద్రపోయారని అన్నారు. రైతులు, బీజేపీ పోరాటాల తర్వాతనే మేల్కొని ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారన్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ విషయంలోనూ కిషన్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను స్వయంగా ఫడ్నవీస్ కార్యాలయానికి ఫోన్ చేశానని.. నెల రోజుల క్రితం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తరఫున ఒక అభ్యర్థన వెళ్లిందని చెప్పారని.. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక అపాయింట్‌మెంట్ అభ్యర్థన రాలేదని స్పష్టం చేశారని వెల్లడించారు.
మెట్రో విషయంలోనూ కేంద్ర ప్రభుత్వ పాత్రను పూర్తిగా దాచిపెడుతున్నారని.. హైదరాబాద్ మెట్రో విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారం గురించి ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులు, మద్దతు, అనుమతులు ఇచ్చిందని తెలిపారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని.. కానీ, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా, డీపీఆర్ స్పష్టత లేకుండా, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. కృష్ణా జలాల విషయంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటిని ఇతర రాష్ట్రాలకు మళ్లించే అంశాలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారని.. పాలమూరు-రంగారెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఈ అంశాలను ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు.






