ఇసుక మాఫియా అంతు చూస్తాం : మంత్రి వివేక్

by Naga Rani Yarlagadda |

ఇసుక మాఫియా అంతు చూస్తామని, బీఆర్ఎస్ నేతలు ఏడాదికి రూ.300కోట్లకుపైగా ఇసుక అక్రమ ద్వారా సొమ్మును బొక్కారని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 37శాతం ఆదాయం పెరిగిందని కార్మిక, ఉపాధి, శిక్షణ, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.

ఇసుక మాఫియా అంతు చూస్తాం : మంత్రి వివేక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇసుక మాఫియా అంతు చూస్తామని, బీఆర్ఎస్ నేతలు ఏడాదికి రూ.300కోట్లకుపైగా ఇసుక అక్రమ ద్వారా సొమ్మును బొక్కారని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 37శాతం ఆదాయం పెరిగిందని కార్మిక, ఉపాధి, శిక్షణ, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కార్మిక సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధే ధ్యేయంగా ఏడాది పాలన సాగిందని స్పష్టం చేశారు. మంత్రి పదవిలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన తన శాఖల ప్రగతి నివేదికను వెల్లడిస్తూ, గిగ్ వర్కర్ల భద్రత నుండి సాండ్ మాఫియా అణిచివేత వరకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాయకత్వంలో గత ఏడాది కాలంగా ప్రజా సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, తెలంగాణ అభివృద్ధిని మరింత వేగవంతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, వారికి సామాజిక భద్రత, బీమా, ఆరోగ్య రక్షణ కల్పించేలా ప్రత్యేక విధానాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని కార్మికులందరికీ కనీస వేతనాలు తప్పనిసరిగా అందేలా చర్యలు చేపట్టామని, కార్మిక హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇసుక అక్రమ రవాణా, సాండ్ మాఫియా కార్యకలాపాలపై ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టించామని, కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని, లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఉచిత ఇసుక సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. సాండ్ మాఫియా కారణంగా పేదల ఇళ్ల నిర్మాణం ఆగిపోకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇసుక సరఫరాలో పారదర్శకతను తీసుకువచ్చి ప్రతి అర్హులైన లబ్ధిదారునికి అందేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

చెన్నూర్ యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించాలనే ఉద్దేశంతో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ)ను ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కేంద్రంలో నిరుద్యోగ యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించబడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఏటీసీ కేంద్రాలు యువతకు ఉద్యోగ అవకాశాల గేట్వేలుగా మారనున్నాయని చెప్పారు. గత ఏడాది ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేసిందని, రాబోయే రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Next Story