పేదలకు ఇళ్ల నిర్మాణంపై శుభవార్త.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్‌ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

పేదలకు ఇళ్ల నిర్మాణంపై శుభవార్త.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఖానామెట్‌లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కార్యాలయ భవనంతో పాటు మియాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.1,674.74 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకే నగరంగా ఉన్నప్పుడు పరిపాలనా పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే హైదరాబాద్ పరిధిలో మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండేలా స్పష్టమైన సరిహద్దులతో కార్పొరేషన్లను రూపొందించామని చెప్పారు. కార్పొరేట్ కంపెనీల కార్యాలయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కార్పొరేషన్ కార్యాలయ భవనాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. మియాపూర్‌లో ద్విముఖ వంతెన, రెండు అండర్‌పాస్‌లు, మియాపూర్ నుంచి ఆల్విన్ క్రాస్ రోడ్ వరకు ఐదు వరుసల ద్విముఖ పైవంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా తగ్గించేందుకు మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

దేశంలోని ప్రధాన నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ.. ముంబైలో ట్రాఫిక్ జామ్‌లు, వర్షాలు వస్తే రోడ్లపై నీరు నిలిచిపోవడం, బెంగళూరులో ట్రాఫిక్ సమస్యల కారణంగా కంపెనీలు హైదరాబాద్‌కు తరలివస్తుండటం, ఢిల్లీలో కాలుష్యం కారణంగా పాఠశాలలు, కార్యాలయాలు మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి సమస్యలు హైదరాబాద్‌లో తలెత్తకుండా ఉండేందుకు నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం లేదని సీఎం విమర్శించారు. సబర్మతి నది అభివృద్ధిని ప్రశంసించే వారు మూసీ ప్రక్షాళనకు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.

రాయదుర్గం టు నియోపొలిస్

రాయదుర్గం నుంచి నియోపొలిస్ వరకు మెట్రో రైలును విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సీఎం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే లక్ష LIG, MIG ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, పేదలు కూడా నగర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలా వారికి ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు. ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి విడిపించుకుని భవిష్యత్ అభివృద్ధి అవసరాలకు వినియోగిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ కూడా అందిస్తున్నామని తెలిపారు.

పదేళ్ల కేసీఆర్ పాలన, 12 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఏం లభించిందనే అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సీఎం సవాల్ విసిరారు. గతంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయకపోయి ఉంటే నేడు హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకునేది కాదన్నారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) నిర్మాణం, పేదలకు ఇళ్లు, మెరుగైన విద్య, వైద్య సేవల కల్పన ద్వారా తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని సీఎం తెలిపారు. రాబోయే 24 నెలల పాటు రోజుకు 18 గంటలు కష్టపడి రాష్ట్రంలోని అన్ని కీలక అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు.

Next Story