సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను ఈడీ కస్టడీకి అనుమతి

by Muthe.Rajitha |

సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను రెండు రోజుల పాటు ఈడీ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.

సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను ఈడీ కస్టడీకి అనుమతి
X

దిశ, తెలంగాణ బ్యూరో : సృష్టి కేసులో అరెస్టైన డాక్టర్ నమ్రతకు సంబంధించిన దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సరోగసీ పేరిట అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో ఆమెను రెండు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 17వ తేదిన ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయ అధికారులు ఐదు రోజుల కస్టడీ కోరగా, కోర్టు రెండు రోజులపాటు మాత్రమే అనుమతించింది. నేటి నుంచి రెండు రోజుల పాటు ఈడీ అధికారులు డాక్టర్ నమ్రతను తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. సరోగసీ కేంద్రం నిర్వహణలో ఆర్థిక అక్రమాలు, విదేశీ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

భారీ మొత్తంలో డబ్బులు సేకరించి, హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. హవాలా లావాదేవీలు, అనధికారిక నిధుల బదిలీలు, విదేశీ ఖాతాల వివరాలు, సహచరుల పాత్ర వంటి అంశాలపై ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. డబ్బు సేకరణ విధానం, లబ్ధిదారులు, ఆర్థిక ప్రవాహాలపై కీలక ఆధారాలు సేకరించేందుకు అధికారులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలుస్తుంది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా మరిన్ని అరెస్టులు లేదా సీజ్ చర్యలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Next Story