- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ
అక్రమ సరోగసీ, మనీలాండరింగ్, శిశు విక్రయాల కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో : అక్రమ సరోగసీ రాకెట్ నిర్వహణ, శిశువుల అక్రమ రవాణా ఆరోపణల కేసులో డైరక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) హైదరాబాద్ జోనల్ కార్యాలయం కీలక చర్యలు చేపట్టింది. డాక్టర్ అత్తూలూరి నమ్రత అలియాస్ పాచిపల్లి నామ్రతను మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఏ), 2002 కింద గురువారం అరెస్ట్ చేసింది. యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్” పేరుతో అక్రమ సరోగసీ రాకెట్ నడిపినట్లు ఈడీ విచారణలో బయటపడింది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో అక్రమ సరోగసీ, శిశు అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కింద దర్యాప్తు ప్రారంభించింది.
ఈడీ దర్యాప్తులో భాగంగా నమ్రత ఆమె అనుచరుల స్టేట్‌మెంట్‌లు రికార్డు చేయగా, పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. సీజ్ చేసిన పత్రాలు, రికార్డుల ఆధారంగా ఆమె 2014 నుంచి ఈ అక్రమ వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్నట్లు వెల్లడైంది. గతంలో కేసులు నమోదై, మెడికల్ లైసెన్స్ సస్పెండ్ అయినప్పటికీ, ఆమె రాకెట్ కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు. కేసులో రాష్ట్ర పోలీసులు నమ్రతను అరెస్ట్ చేసి, నవంబర్ 27న బెయిల్‌పై విడుదల చేశారు. బెయిల్ తర్వాత కూడా విచారణలో సహకరించకుండా తప్పించుకునే ధోరణి ప్రదర్శించినట్లు ఈడీ తెలిపింది.
పేద మహిళల నుంచి శిశువుల సేకరణ
సంతానం లేని దంపతులకు సరోగసీ పేరుతో శిశువులను అందిస్తామని భారీ మొత్తాలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ప్రక్రియ నిజమైనదిగా చూపించేందుకు దంపతుల గామీట్స్ సేకరించినప్పటికీ, వాస్తవానికి పేద, నిరుపేద గర్భిణీ మహిళలను డబ్బుతో ప్రలోభపెట్టి శిశువులను అప్పగింపజేసినట్లు వెల్లడైంది. ఏజెంట్లు, సబ్‌ఏజెంట్ల నెట్‌వర్క్ ద్వారా గర్భిణీ మహిళలను గుర్తించి, ప్రసవం తర్వాత శిశువులను తీసుకునేలా ఒప్పందాలు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆడ శిశువుకు సుమారు రూ.3.5 లక్షలు, మగ శిశువుకు రూ.4.5 లక్షలు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. సికింద్రాబాద్ ఆసుపత్రి లైసెన్స్ రద్దు కావడంతో విశాఖపట్నంలోని ఆసుపత్రిలో ప్రసవాలు నిర్వహించినట్లు వెల్లడైంది.
జనన నివేదికలను మున్సిపల్ అధికారులకు పంపేటప్పుడు అసలు తల్లిదండ్రుల పేర్ల స్థానంలో సంతానం లేని దంపతుల పేర్లు చేర్చి నకిలీ పత్రాలు సమర్పించినట్లు దర్యాప్తులో బయటపడింది. దంపతుల నుంచి చెక్కులు, నగదు రూపంలో భారీ మొత్తాలు సేకరించి, వాటిలో కొంత మొత్తాన్ని ఏజెంట్లు, సబ్‌ఏజెంట్లకు కమీషన్‌గా, మిగతావాటిని బయాలజికల్ తల్లిదండ్రులకు చెల్లించినట్లు బ్యాంకు లావాదేవీల విశ్లేషణలో స్పష్టమైంది. అరెస్ట్ అనంతరం నమ్రతను హైదరాబాద్ నాంపల్లిలోని ఎంఎస్‌జే కోర్టు ఎదుట హాజరుపరచగా, కోర్టు ఆమెను 26 ఫిబ్రవరి వరకు జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ వెల్లడించింది.
- Tags
- ED
- Dr.Namrata






