Creation Fertility Scandal: డాక్టర్ నమ్రత‌ను అరెస్ట్ చేసిన ఈడీ

by Malleboina Mahesh |

రూ. 25 కోట్ల అక్రమ ఆస్తులు, సరోగసీ మోసాలు! మనీలాండరింగ్ కేసులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను ఈడీ అధికారులు చేశారు. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా ఫిబ్రవరి 26 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Creation Fertility Scandal: డాక్టర్ నమ్రత‌ను అరెస్ట్ చేసిన ఈడీ
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ (Shrishti Fertility Center) కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సరోగసీ ముసుగులో భారీగా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో డాక్టర్ నమ్రత (Dr. Namrata)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా ఆమె ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టిన అధికారులు కీలక ఆధారాలు సేకరించిన అనంతరం ఆమెను అరెస్టు చేశారు. గురువారం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఫిబ్రవరి 26 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఇదిలా ఉంటే ఈ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సంతానం లేని దంపతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని, సరోగసీ పేరిట ఒక్కొక్కరి నుంచి సుమారు రూ. 30 లక్షల నుంచి 40 లక్షల వరకు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే, అసలైన వైద్య ప్రక్రియలు చేయకుండా, పేద మహిళల నుంచి శిశువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి వారిని దంపతులకు అప్పగించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో నకిలీ DNA రిపోర్టులు, ఫోర్జరీ పత్రాలను సృష్టించి కోట్లాది రూపాయల మేర అక్రమంగా ఆర్జించినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది.

గతేడాది రాజస్థాన్‌కు చెందిన ఓ దంపతులు తమకు అప్పగించిన శిశువుపై అనుమానంతో DNA పరీక్ష చేయించడం తో ఈ రాకెట్ గుట్టురట్టయింది. కాగా అక్రమ మార్గాల్లో సంపాదించిన దాదాపు రూ. 25 కోట్ల నిధులను విదేశాల్లో పెట్టుబడులుగా మళ్లించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ కుంభకోణంలో డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణతో పాటు ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Next Story