- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పశ్చిమ బెంగాల్‌లో ఈసీ గర్జన: 13 జిల్లాల ఎస్పీల మార్పు
బెంగాల్ ఎన్నికల వేళ ఈసీ భారీ యాక్షన్. సీఎస్, డీజీపీల తర్వాత తాజాగా 13 జిల్లాల ఎస్పీల బదిలీ. నిష్పక్షపాత ఎన్నికల కోసం యంత్రాంగంపై ఉక్కుపాదం.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావణంతో పాటు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రాష్ట్ర పరిపాలనా యంత్రాంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తుంది. తాజా పరిణామంలో, ఎన్నికల సంఘం మంగళవారం ఏకకాలంలో 13 జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లను (SPs) బదిలీ చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. బీర్భమ్, ముర్షిదాబాద్, మాల్దా, పుర్బా మేదినీపూర్ వంటి కీలక జిల్లాలకు కొత్త అధికారులను నియమించింది. బదిలీ అయిన అధికారులను ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి కీలక బాధ్యతల్లో ఉంచకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలో అత్యంత వేగవంతమైన, భారీ స్థాయి పోలీస్ ప్రక్షాళనగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ ప్రక్షాళన పర్వం గత మూడు రోజులుగా ఒక ప్రణాళికాబద్ధంగా సాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజే (మార్చి 15), రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి షాక్ ఇస్తూ చీఫ్ సెక్రటరీ (CS) నందినీ చక్రవర్తిని, హోం సెక్రటరీని విధుల్లోంచి తొలగించి వారి స్థానంలో కొత్త అధికారులను నియమించింది. ఆ మరుసటి రోజే (మార్చి 16), రాష్ట్ర డీజీపీ (DGP) పీయూష్ పాండేపై వేటు వేసి సిద్ధనాథ్ గుప్తను నియమించడంతో పాటు, కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను కూడా మార్చేసింది. కేవలం 72 గంటల వ్యవధిలో సీఎస్, డీజీపీ స్థాయి నుంచి జిల్లా ఎస్పీల వరకు కీలక పోస్టులన్నీ మార్చడం ద్వారా, ఎన్నికల నిర్వహణలో తాము ఏమాత్రం రాజీ పడబోమని ఎన్నికల సంఘం స్పష్టమైన హెచ్చరికలు పంపిందని రాజకీయ విమర్శకులు సైతం చర్చించుకుంటున్నారు.






