- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్ళీ విజృంభిస్తున్న ఎబోలా.. ఏకంగా 65 మంది మృతి
ఆఫ్రికాలోని కాంగో ఈశాన్య ప్రాంతంలో వందలాది ఎబోలా వైరస్ కేసులు నమోదు అవుతుండటం కలకలం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఆఫ్రికాలో మరోసారి ఎబోలా విజృంభిస్తోంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) ఈశాన్య ప్రాంతంలో వందలాది ఎబోలా వైరస్ కేసులు నమోదు అవుతుండటం కలకలం రేపుతోంది. తాజా నివేదికల ప్రకారం ఇప్పటివరకు 65 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 246 ఎబోలా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(Africa CDC) సేకరించిన 20 శాంపిల్స్‌లో 13 శాంపిల్స్‌కు ఎబోలా సోకినట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ముఖ్యంగా ఇటూరి ప్రావిన్స్‌లో అత్యధిక మరణాలు సంభవించడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే 2018-20 మధ్య కాలంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎబోలా ప్రభావాన్ని ఎదుర్కొన్న ప్రాంతం ఇది. దాదాపు 7 లక్షల జనాభా కలిగిన బునియా వంటి నగరాలకు కూడా ఈ వైరస్ వ్యాపిస్తే ఒక పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది.
కాంగోలోని మైనింగ్ పరిశ్రమ కారణంగా ప్రజలు నిరంతరం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్లడం, ప్రభావిత ప్రాంతాల్లో కాంటాక్ట్ ట్రేసింగ్‌లో ఉన్న లోపాలు వైరస్ వ్యాప్తిని వేగంగా పెంచుతున్నాయి. ముఖ్యంగా ఎబోలా ప్రభావిత ప్రాంతాలు ఉగాండా, దక్షిణ సూడాన్ సరిహద్దులకు అతి సమీపంలో ఉండటంతో, ఈ దేశాలకు కూడా వైరస్ వ్యాపించిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆఫ్రికా CDC ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తో కలిసి పనిచేస్తోంది. అలాగే మెర్క్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా వంటి అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతో సంప్రదింపులు జరుపుతూ, టీకాలు, అవసరమైన మందులను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.






