తెలంగాణలో ఇకపై ఈ–కేబినెట్ మీటింగ్స్

by Malleboina Mahesh |

తెలంగాణలో ఇకపై ‘పేపర్‌లెస్’ కేబినెట్ సమావేశాలు. మంత్రులకు ట్యాబ్‌లు, ఎలక్ట్రానిక్ ఎజెండా.. సీఎం రేవంత్‌రెడ్డి మార్క్‌తో డిజిటల్ పాలన షురూ!

తెలంగాణలో ఇకపై ఈ–కేబినెట్ మీటింగ్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కేబినెట్ సమావేశాలు ఇకపై ఎలక్ట్రానిక్ విధానంలో జరగనున్నాయి. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరిపాలనలో పేపర్‌లెస్ విధానాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటి నుంచో అధికారులు హితబోధ చేస్తున్నారు. అన్ని కార్యాలయాల్లో ముఖ్యంగా సచివాలయం, డైరెక్టరేట్, కమిషనరేట్ కార్యాలయాల్లో పేపర్‌లెస్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశాలను పేపర్ రహితంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో అత్యాధునిక ట్యాబ్‌లు కొనుగోలు చేయడం, వాటికి అవసరమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లను సమకూర్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సాఫ్ట్‌వేర్‌ నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) నుంచి సాఫ్ట్‌వేర్‌ను తీసుకుంటున్నారు.

ఈ విధానంలో పారదర్శకత, జవాబుదారితనం పెరగడమే కాకుండా, కీలకమైన సమాచారం బయటకు పొక్కకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేబినెట్ నిర్ణయాలు వెంట వెంటనే రికార్డు అవుతాయి. మంత్రులకు పంపించే కేబినెట్ ఎజెండా సైతం పేపర్ విధానంలో కాకుండా ఎలక్ట్రానిక్​ విధానంలో పంపించనున్నారు. కేబినెట్ నిర్ణయాలను డిజిటలైజ్ చేయనున్నారు. పేపర్‌లెస్ కేబినెట్ విధానాన్ని దేశంలో తొలిసారిగా హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసింది. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్​ ప్రదేశ్ రాష్ట్రాలు ఈ విధానాన్ని అందిపుచ్చుకున్నాయి. ఈ–కేబినెట్​ సమావేశాల నిర్వహణపై ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఐటీ, జీఏడీ అధికారులతో కలిసి సమీక్షించారు. త్వరలో జరిగే సమావేశాన్ని ఎలక్ట్రానిక్ విధానంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story