అభివృద్ధి చారెడు.. బిల్లులు బారెడు..!

by Batti.Sumithra |

సామాన్య ప్రజలు తప్పులు చేస్తే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటారు.

అభివృద్ధి చారెడు.. బిల్లులు బారెడు..!
X

దిశ, బషీరాబాద్ : సామాన్య ప్రజలు తప్పులు చేస్తే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటారు. అలాంటిది ప్రభుత్వ అధికారులే తప్పులు చేస్తే వారి పై ఎవరు చర్యలు తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిధులను అక్రమంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ పై బషీరాబాద్ ఎంపీడీఓ సంపత్ కుమార్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని దామర్‌చేడ్ గ్రామంలో అభివృద్ధి పనుల పేరుతో పంచాయతీ కార్యదర్శి అక్రమ బిల్లులు చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీని పై సమగ్ర విచారణ జరపాలని గ్రామానికి చెందిన వార్డు సభ్యులు, గ్రామస్థులు మండల అభివృద్ధి అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని విమర్శిస్తున్నారు.

గ్రామాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాల్లో మండల అభివృద్ధి అధికారి హస్తం కూడా ఉందని గ్రామస్థులు, వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసి నెల రోజులు గడిచినా విచారణ చేపట్టకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం పై ఉన్నతాధికారులు స్పందించి అక్రమ బిల్లులకు పాల్పడిన సర్పంచ్, కార్యదర్శితో పాటు బిల్లుల చెల్లింపులకు సహకరించిన అధికారుల పై సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, వార్డు సభ్యులు కోరుతున్నారు.

అక్రమాలు ఇలా..

1. మోటార్ మరమ్మతులు, పైప్‌లైన్ లీకేజీ, గేట్‌వాల్ మరమ్మతుల పేరుతో రూ.1,67,260ను 21-04-2026న డ్రా చేశారు.

2. వీధి దీపాల కొనుగోలు, స్తంభాలకు బిగింపు చార్జీల పేరుతో రూ.50,500 డ్రా చేసుకున్నారు.

3. వీధి దీపాల మరమ్మతులు, సర్వీస్ చార్జీల పేరుతో రూ.21,000ను 22-10-2024న డ్రా చేశారు.

4. మోటార్ల మరమ్మతులు, కొత్త స్టార్టర్ ఏర్పాటు, పైప్‌లైన్ లీకేజీ, కొత్త సర్వీస్ వైర్ కోసం రూ.32,000ను 22-10-2024న డ్రా చేశారు.

5. బోరుబావి డ్రిల్లింగ్, మోటార్ దించడం, ఇతర మోటార్ల మరమ్మతులు, కొత్త గేట్‌వాల్ ఏర్పాటుకు రూ.2,11,670ను ఓ నాయకుడి ఖాతాకు బదిలీ చేసినట్లు సమాచారం.

6. మోటార్ రిపేర్ పేరుతో రూ.1,80,916ను మాజీ సర్పంచ్ మోహన్‌రెడ్డి పేరుపై బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

7. పంచాయతీ ట్రాక్టర్‌కు ఐదు నెలల డీజిల్ బిల్లు, ట్రాక్టర్ బ్యాటరీ కొనుగోలు, జీపీ భవనం పెయింటింగ్ పేరుతో రూ.1,06,776ను 03-06-2026న అధికార ప్రతినిధి భర్త పేరు పై బిల్లులు చేసినట్లు సమాచారం.

8. హైమాస్ట్ లైట్లు, వీధి బల్బుల కొనుగోలు కోసం రూ.1,13,323కు ఎంబీ రికార్డు చేసి, కేవలం కొద్ది బల్బులు మాత్రమే బిగించి, మిగిలిన హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు.

వేరే గ్రామానికి అటాచ్..

గ్రామాభివృద్ధి పనుల వ్యయానికి మించి అధిక మొత్తంలో బిల్లులు చేసిన పంచాయతీ కార్యదర్శి పై విచారణ జరపాలని ఫిర్యాదు చేసినప్పటికీ, మండల అధికారి ఎలాంటి విచారణ చేపట్టకుండా ఆ కార్యదర్శిని పక్క గ్రామానికి అటాచ్ చేయడం పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శి పై జాలి, దయ చూపుతున్నారని మండల అధికారి పై ఆరోపణలు చేస్తున్నారు.

డీఎల్పీఓ ఏమన్నారంటే..

ప్రభుత్వ నిధులను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేసి అక్రమ బిల్లులు చేసిన వారెవరైనా వారి పై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని డీఎల్పీఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అక్రమ బిల్లులకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

Next Story