- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనింగ్ శాఖలో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం.. డ్రైవర్ల ఆందోళన
మైనింగ్ శాఖ అధికారుల పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తులు రోడ్లపై టిప్పర్లను అడ్డగించి వేధింపులకు పాల్పడుతున్నారని, అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట టిప్పర్ యజమానులు, డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

దిశ,సూర్యాపేట: మైనింగ్ శాఖ అధికారుల పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తులు రోడ్లపై టిప్పర్లను అడ్డగించి వేధింపులకు పాల్పడుతున్నారని, అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట టిప్పర్ యజమానులు, డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తమపై జరుగుతున్న వేధింపులను వెంటనే నిలిపివేయాలని, వేలాది మందికి జీవనాధారంగా ఉన్న టిప్పర్ రంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. టిప్పర్లను కలెక్టరేట్ ఎదుట నిలిపి ఆందోళన నిర్వహించిన యజమానులు మాట్లాడుతూ, మైనింగ్ శాఖలో కొందరు ప్రైవేటు వ్యక్తులు అధికారుల పేరుతో చెలరేగిపోతున్నారని ఆరోపించారు.
రోడ్లపై వాహనాలను అడ్డగించి తనిఖీల పేరుతో డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెడతామని, భారీ పెనాల్టీలు విధిస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. సూర్యాపేట జిల్లాలో నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రధాన రహదారులు, ఇతర అభివృద్ధి పనుల్లో తమ టిప్పర్లు కీలకంగా పని చేశాయని సంఘం ప్రతినిధులు తెలిపారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి కోట్ల రూపాయల రుణాలు తీసుకుని వాహనాలు కొనుగోలు చేశామని, ఈ రంగంపై డ్రైవర్లు, క్లీనర్లు, డోజర్ ఆపరేటర్లు, మెకానిక్‌లు, కుటుంబ సభ్యులు కలిపి దాదాపు 200 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు.
మట్టి తరలింపు పేరుతో అక్రమ కేసులు..
మట్టి తరలింపు పేరుతో తమపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. మట్టి లోడుతో రోడ్డుపైకి వచ్చిన వెంటనే వాహనాలను నిలిపి వేసి భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారని, కొన్నిసార్లు 20 రోజుల వరకు టిప్పర్‌కు పని చేయకుండా ఆదేశాలు ఇస్తున్నారని తెలిపారు. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో రోజువారీ ఆదాయం పూర్తిగా ఆగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టిప్పర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లు, బస్ డిపోల్లో వారాల తరబడి, నెలల తరబడి ఉంచడం వల్ల తీవ్ర నష్టాలు వస్తున్నాయని చెప్పారు. వాహనాల ఈఎంఐలు చెల్లించలేక బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని, డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
బైండోవర్ కేసులతో భయభ్రాంతులకు గురి..
పోలీస్ స్టేషన్లలో ఒక్కో టిప్పర్ యజమానిపై రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. తాము నేరస్థులు కానప్పటికీ మట్టి మాఫియా, సమాజ విద్రోహ శక్తులుగా ముద్ర వేస్తూ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు చేయడం లేదని స్పష్టం చేశారు. రైతుల నుంచి అనుమతి తీసుకుని, వారికి డబ్బులు చెల్లించి పట్టా భూములను సాగుకు అనుకూలంగా మార్చే పనుల్లో భాగంగానే మట్టిని తరలిస్తున్నామని వివరించారు. అయినప్పటికీ ఎలాంటి విచారణ లేకుండా తమపై కేసులు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు.
కలెక్టర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి..
అధికారుల వేధింపుల కారణంగా టిప్పర్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని యజమానులు తెలిపారు. తమ కుటుంబాలతో పాటు వందలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని మైనింగ్ శాఖలో ప్రైవేట్ వ్యక్తుల జోక్యాన్ని అరికట్టాలని, అధికారుల పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్ల పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా మట్టి తరలింపునకు అనుమతులు కల్పించి, ఇసుక రీచ్‌ల మాదిరిగానే మట్టి కోసం ప్రత్యేక ప్రాంతాలను గుర్తించాలని కోరారు. టిప్పర్ యజమానులు, డ్రైవర్ల ఉపాధిని కాపాడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.






