పెంగ్విన్ జనాభా లెక్కించేందుకు జాబ్ నోటిఫికేషన్

by Dishanational2 |
పెంగ్విన్ జనాభా లెక్కించేందుకు జాబ్ నోటిఫికేషన్
X

దిశ, ఫీచర్స్ : రిమోట్ ప్లేస్‌లో ఉద్యోగం చేయాలనుకునే ఔత్సాహికులకు ఓ బ్రిటిష్ స్వచ్ఛంద సంస్థ బంపర్ ఆఫర్ అందిస్తోంది. ఈ జాబ్‌కు ఎంపికైనవారు ప్రపంచంలోనే అత్యంత మారుమూల పోస్టాఫీస్‌లో పనిచేయాల్సి ఉండటంతో పాటు పెంగ్విన్ జనాభాను లెక్కించాల్సి ఉంటుంది.

యూకే‌కు చెందిన హెరిటేజ్ ట్రస్ట్.. అంటార్కిటికాలోని 'పోర్ట్ లాక్‌రాయ్‌'లో కొత్త బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు బేస్ లీడర్, షాప్ మేనేజర్, గిఫ్ట్ షాప్ అసిస్టెంట్, పోస్టాఫీస్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ట్రస్ట్ అంటార్కిటిక్ ద్వీపకల్పంలోని చారిత్రాత్మక ప్రదేశాలు, స్మారక చిహ్నాలను పర్యవేక్షిస్తుండగా.. ఉద్యోగానికి ఎంపికైన వారు వాటికి సంరక్షకులుగా పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాదు బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే కోసం జెంటూ పెంగ్విన్ కాలనీలోని పెంగ్విన్స్ జనాభానే కాక ఇతర వన్యప్రాణులను సైతం లెక్కించాల్సి ఉంటుంది. కేవలం ఐదు నెలల కాలపరిమితి గల ఈ జాబ్ ముగిసే సమయానికి నివేదిక సమర్పించాలి.

ఈ ఉద్యోగానికి శారీరక దృఢత్వం, పర్యావరణ స్పృహతో పాటు కనీస జీవన పరిజ్ఞానమున్న ఉద్యోగార్థులను అర్హులుగా ట్రస్ట్ పేర్కొంది. ఎంపికైన వ్యక్తులు అక్టోబర్ 2022లో కేంబ్రిడ్జ్‌లో ఒక వారం పాటు శిక్షణ తర్వాత అంటార్కిటికాలో మార్చి 2023 వరకు పనిచేస్తారు. ఈ మేరకు 'అంటార్కిటికా వారసత్వాన్ని, దాని విలువైన పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగమయ్యేందుకు ఏప్రిల్ 25లోపు దరఖాస్తు చేసుకోవాలని ట్రస్ట్‌ సంబంధిత ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. కాగా పోర్ట్ లాక్‌రాయ్ అంటార్కిటిక్ ద్వీపకల్పంలో స్థాపించిన మొట్టమొదటి బ్రిటిష్ శాస్త్రీయ పరిశోధనా స్థావరం. 2006 నుంచి పోస్టాఫీస్, మ్యూజియంతో పర్యాటక ప్రదేశంగా కొనసాగుతోంది.


Next Story