- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర.. డీఆర్డీఓ ‘మిస్సైల్ షీల్డ్’ పరీక్షలు సక్సెస్
డీఆర్డీఓ నిర్వహించిన మూడు వరుస క్షిపణి పరీక్షలు విజయవంతం కావడంతో ఐసీబీఎమ్‌లను (ICBMs) సైతం అడ్డుకోగల 'బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్' కలిగిన అగ్రరాజ్యాల సరసన భారత్ చేరింది.

దిశ, వెబ్ డెస్క్: భారత రక్షణ రంగం మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత రక్షణ పరిశోధన సంస్థ (DRDO) సరికొత్త నెక్స్ట్-జనరేషన్ సాంకేతికతలతో దేశ రక్షణ సామర్థ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. సుదూర లక్ష్యాలను ఛేదించగల శత్రుదేశాల బాలిస్టిక్ క్షిపణులను (Ballistic Missiles) అడ్డుకునేందుకు ఉద్దేశించిన మల్టీ-లేయర్డ్ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (BMD) వ్యవస్థకు సంబంధించి డీఆర్డీఓ వరుసగా మూడు విజయవంతమైన ఫ్లైట్-టెస్టులను నిర్వహించింది. ఈ పరీక్షల ద్వారా భారత్ తన అజేయమైన రక్షణ కవచాన్ని విజయవంతంగా నిరూపించుకుంది.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం
డీఆర్డీఓ అందుకున్న ఈ మైలురాయిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ..శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పరీక్షల సమయంలో ఇంటర్‌సెప్టర్ క్షిపణులు తమకు కేటాయించిన లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టి, శత్రు క్షిపణులను గాల్లోనే తుత్తునియలు చేశాయని మంత్రి ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు. అంతర ఖండాల బాలిస్టిక్ క్షిపణుల (ICBMs) స్థాయి శత్రు ప్రమాదాలను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనే అధునాతన 'బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్' సామర్థ్యాలు కలిగిన ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అగ్రరాజ్యాల (ఎలైట్) గ్రూపులో ఈ పరీక్షల ద్వారా భారత్ అధికారికంగా చేరిందని ఆయన స్పష్టం చేశారు.
మొదటి నావల్ యాంటీ-షిప్ మిస్సైల్ పరీక్ష విజయవంతం..
బాలిస్టిక్ క్షిపణుల రక్షణ కవచంతో పాటు, భారత నౌకాదళ బలాన్ని పెంచేలా నావల్ యాంటీ-షిప్ మిస్సైల్-మీడియం రేంజ్ (NASM-MR) కు సంబంధించిన మొట్టమొదటి (Maiden) ఫ్లైట్-టెస్ట్‌ను కూడా డీఆర్డీఓ విజయవంతంగా పూర్తి చేసింది. ఇది మధ్య శ్రేణి పరిధిలో సముద్రంలో శత్రువుల యుద్ధనౌకలను, కదలికలను సమర్థవంతంగా తుడిచి పెట్టగలదు. సరిహద్దుల్లో మారుతున్న ఆధునిక క్షిపణి సవాళ్లను తిప్పికొట్టేందుకు ఈ స్వదేశీ సాంకేతికతలు ఎంతగానో ఉపయోగపడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.






