డ్రైవర్‍గా మారిన సీఎం విజయ్.. ఏకంగా 130 కి.మీ స్వయంగా డ్రైవింగ్

by Prasad Jukanti |   (  Updated:2026-06-13 06:30:04  IST  )

కర్ణాటక మూకాంబికా ఆలయాన్ని సందర్శించిన తమిళనాడు సీఎం విజయ్ అరుదైన రికార్డు సాధించారు.

డ్రైవర్‍గా మారిన సీఎం విజయ్.. ఏకంగా 130 కి.మీ స్వయంగా డ్రైవింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే చీఫ్ విజయ్ (CM Vijay) తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రతిరోజూ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. పరిపాలనలో కొత్త ఒరవడి సృష్టిస్తూ ప్రజలకు మరింత చేరువ అయ్యేలా తన ప్రణాళికలు ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన కర్ణాటక కొల్లూరులోని మూకాంబికా అమ్మవారి దేవాలయాన్ని సందర్శించడం రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈ దేవాలయాన్ని సందర్శించిన విజయ్ అమ్మవారికి సుమారు రూ.5 లక్షల విలువైన 1.6 కేజీల వెండి ఖడ్గాన్ని, పట్టు చీర, పండ్లు, పూజా సామాగ్రి సమర్పించారు. అయితే ఈ పర్యటన సందర్భంగా విజయ్ చేసిన ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత విజయ్ ఒక్కసారిగా డ్రైవర్ అవతారం ఎత్తాడు. ఆలయం నుంచి విమానాశ్రయం వరకు దాదాపు 130 కిలోమీటర్లు కాన్వాయ్‍లో తాను ప్రయాణించే కారును స్వయంగా విజయ్ డ్రైవ్ చేశారు. అంతే కాదు మార్గ మధ్యలో ఒక టోల్ గేట్ వద్ద అభిమానులు విజయ్‍ను గుర్తు పట్టి చేతులు ఊపగా అందుకు బదులుగా డ్రైవింగ్ సీట్లో ఉన్న విజయ్ సైతం అభివాదం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మూడో సీఎంగా విజయ్:

విజయ్ మూకాంబికా ఆలయ పర్యటనకు చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. పదవిలో ఉండగా ఈ ఆలయాన్ని సందర్శించిన మూడవ తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ నిలిచారు. ఈ ఘనత సాధించిన వారిలో మాజీ ముఖ్యమంత్రులు ఎం.జి.రామచంద్రన్, జయలలిత ఉండగా తాజాగా సీఎం కూడా వారి బాటలోనే పయణించారు. జూన్ 22న విజయ్ 52వ పుట్టిన రోజుకు కొద్ది రోజుల ముందు ఈ యాత్ర జరగడం ప్రత్యేకంగా మారింది. మరోవైపు తమిళనాడు, కర్ణాటక మధ్య నీటి పంచాయతీ నడుస్తున్న తరుణంలో విజయ్ కర్ణాటక పర్యటన రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తికరంగా మారింది.

Next Story