వడియారం గ్రామ శివారులో దారుణం.. అడ్రస్ అడిగి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-13 06:40:24  IST  )

ఇంటి అడ్రస్ అడుగుతున్నట్లు నటించి ఓ మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును అపహరించిన ఘటన చేగుంట మండలం వడియారం గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది.

వడియారం గ్రామ శివారులో దారుణం.. అడ్రస్ అడిగి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు
X

దిశ, చేగుంట: ఇంటి అడ్రస్ అడుగుతున్నట్లు నటించి ఓ మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును అపహరించిన ఘటన చేగుంట మండలం వడియారం గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. బాధితురాలు అల్లంకి ధనలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె ప్రతిరోజు మాదిరిగానే ఉదయం చేగుంట బస్టాండ్ సమీపంలోని మైనంపల్లి వెంచర్ ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి ఓ ఇంటి చిరునామా గురించి అడిగారు. ధనలక్ష్మి వారికి చిరునామా వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తున్న సమయంలో దుండగులు ధనలక్ష్మిని మాటల్లో పెట్టి ఆమె మెడలో ఉన్న ఐదున్నర తులాల బంగారు పుస్తెలతాడును లాక్కునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో పుస్తెలతాడు సగం తెగిపోగా సుమారు మూడు తులాల బంగారం పుస్తెలతాడుతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ధనలక్ష్మి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

Next Story