- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సందేశాత్మకమైన కళాఖండాలు... కొత్త ప్రపంచం
హెచ్సీయూ(హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ)లో ఎంఎఫ్ఏ చివరి సంవత్సర విద్యార్థులు తమ కళాఖండాలని మే చివరి వారంలో ప్రదర్శించారు.

ఉన్నత విద్యాసంస్థలైన జేఎన్యూ, హెచ్సీయూ వంటి వాటిలో ఆలోచన, విశ్లేషణ పరిఢవిల్లుతాయని, బట్టీ పట్టడం కాక, విస్తరించిన ఆలోచనా విధానంతో విద్యార్థులు ఎంతో ఎత్తుకు ఎదుగుతారని, మంచిని గుర్తించడం, చెడుని ఖండించడం, దుర్మార్గాన్ని ప్రశ్నించడం నేర్చుకుంటారని చూస్తూనే ఉన్నాం. అలాంటి హెచ్సీయూ(హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ)లో ఎంఎఫ్ఏ చివరి సంవత్సర విద్యార్థులు తమ కళాఖండాలని మే చివరి వారంలో ప్రదర్శించారు. ఇవి ఎంతో హృద్యంగా, ఆలోచన రేకెత్తించేవిగా ఉన్నాయి. మరోసారి రోహిత్ వేములని స్మరించుకుంటూ, అతని విగ్రహాన్ని చూసి అతనికి నివాళి అర్పించి, సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లోకి అడుగు పెట్టగానే కళా ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు వుంది.
నవనవలాడుతున్న యువతీయువకులు తాము ఎంతో ఓర్పుగా, నేర్పుగా, తమ ఆలోచనలని పోతపోసి తయారు చేసిన ప్రాజెక్టులని ప్రదర్శించడమే కాక, వాటి గురించి వివరిస్తూ, ఎంతో ఉత్సాహం కనబరుస్తూ మా ఉత్సుకతని పెంచారు. ‘సమాజంలో బ్రతుకుతున్న ఏ మనిషైనా సమాజానికి దూరంగా వుండలేడు’ అనే లెనిన్ మాటలని గుర్తు చేస్తూ ఈ కళాకారులు తమ జీవితాలకి దగ్గరగా ఉన్న ఇతివృత్తాలని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దారు. అలాగే, ‘శాస్త్రీయ విజ్ఞానం ప్రపంచానికి మేధో సంపత్తి అయితే, కళ దానికి ఆత్మ వంటిది’ అన్న గోర్కి మాటలని నిజం చేస్తూ వాళ్ళు తమ కళాఖండాల్లో నిజంగానే తమ ఆత్మలని నింపారు! తమ చుట్టూ వున్న జీవితాలని ఆకళింపు చేసుకుంటూ, తమ సొంత అనుభవాలని మేళవిస్తూ, ఉన్నతమైన ఆశయాలను ఆవిష్కరిస్తూ, కళకి వున్న సామాజిక దృష్టి కోణాన్ని ఎంతో నేర్పుగా ప్రదర్శించారు. తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, బంగ్లాదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వీరు రకరకాల మాధ్యమాల ద్వారా తమ భావాలను వ్యక్తీకరించారు.
తిని పారేసిన పేపర్లతో బొమ్మలు
మన జీవితాలని సింథటిక్ ఎలా ప్రభావితం చేస్తుందో ఉదహరిస్తూ ఇషా మనం తిని పారేసిన పేపర్లతో బొమ్మలు చేసి, అవి ఎంత తేలిగా చెడిపోగలవో చెప్తూ, ఇలాగే మన సింథటిక్ జీవితాలు బుడగప్రాయం అని హెచ్చరిస్తుంది. మరొకవైపు ఆమె వాస్తవ వ్యక్తీకరణలో తన నేర్పుని కూడా నిరూపించుకుంటుంది. ఒక చిన్న సీసాలో కాయితం పూలని పెట్టి, దాని పైన చేతి నమూనా, తుపాకి నమూనా వగైరాలని పెట్టి, పక్కనే వాటిని పెన్సిల్ డ్రాయింగ్ లతో ప్రతిఫలిస్తుంది. అంటే, చేతి పనులని చిత్రాలుగా రూపాందిస్తుంది. ఆవరణ బయట చెట్టు మీద గాలితో ఊదిన నెమళ్ళ నమూనాలని తగిలించి, కొన్నింటికి గాలి తీసేసి, జీవితం బుడగప్రాయం.. సుమా అని హెచ్చరిస్తుంది.
అప్లికేషన్లలో చిక్కుకుపోతున్న మనిషి బొమ్మలు
నాగా జీవితాన్ని ...యాజింగ్ షిమ్ రే అనే కళాకారుడు చాలా నేర్పుగా సన్నని బాల్ పాయింట్ గీతలు నలుపు, రంగురంగుల గీతలతో కళ్ళకు కట్టాడు. మరొకవైపు అదే జీవితాన్ని లినోకట్‌లో కూడా చిత్రీకరిస్తే, చిత్త ప్రసాద్ యాభై దశకంలో చూపించిన జీవితం గుర్తొస్తుంది. ప్రకృతి, సంప్రదాయం, జ్ఞాపకాల కలబోతగా సాగే ఈ మణిపురి కళాకారుడి చిత్రాలలో రోజువారి జీవితాల్లోని ఆటుపోట్లు కనిపిస్తాయి. దీనికి పూర్తి విభిన్నమైన చిత్రంలో కూడా, ఒక మనిషి తన కళని పక్కకి పెట్టి, పెయింట్ బ్రష్, బాల్ పాయింట్ పెన్స్, రంగులు పక్కకి పెట్టి, మొబైల్ ఫోను, దాని అప్లికేషన్లలో చిక్కుకుపోయి ఎలా బక్కచిక్కిపోతున్నాడో కూడా షిమ్ రే చూపిస్తున్నాడు. ఇది చాలా భావయుక్తంగా వుండి, వెంటనే ఆకట్టుకుంటుంది.
ఆకాశ హర్మ్యాలలో వెక్కిరిస్తున్న ప్లాస్టిక్ మొక్కలు
ప్రకృతి, జీవరాశులు, సామాజిక జీవనంలో వున్న అంతస్సూత్రాన్ని అన్వేషిస్తూ తుఫేల్ అనే కేరళ కళాకారుడు జీవశాస్త్రాన్ని, మేథమెటిక్స్ ని జోడిస్తూ చీమల జీవనంలోని క్రమబద్ధతని ఉన్నతమైన ప్రింట్ టెక్నిక్ రూపంలో ప్రదర్శించాడు. మరొకరు చెట్లని సజీవంగా చిత్రించే ప్రయత్నం చేసారు. ఆధునికీకరణ పేరుతో మనం మర్చిపోతున్న చెట్లని, వాటి అందాన్ని, వాటి జీవ చైతన్యాన్ని చూపిస్తూ, చెట్లని కొట్టేసి నిర్మించిన ఆకాశ హర్మ్యాలలో వెక్కిరిస్తున్న ప్లాస్టిక్ మొక్కలని నిరసిస్తుంది. ఇది కేబీఆర్ పార్కు నిరసనలనున గుర్తుచేస్తోంది. ఢిల్లీకి చెందిన ఈ విద్యార్థి సృష్టి శర్మ బొగ్గుతో వేసిన చిత్రంలో, విడివిడిగా కనిపిస్తున్న అంశాల్లోని సారూప్యతని వివరిస్తుంది.
నార్మల్ అనే చట్రంలో బిగించిన జీవితాలు
అస్సాంకి చెందిన కిరణ్‌జ్యోతి, తమ రాష్ట్రంలోని ప్రకృతి వైపరీత్యాలను ప్రతిఫలింప చేస్తాడు. బ్రహ్మపుత్ర వరదల్లో కొట్టుకొచ్చిన మట్టిని, బొగ్గుని, రంగుల్ని జోడించి సృష్టించిన కళాకండాల్లో ముఖాలు అస్పష్టంగా కనిపిస్తాయి. దానికి వివరణ ఇస్తూ, స్పష్టంగా చెక్కిన ముఖాలని గీకేస్తే, ప్రకృతి వైపరీత్యంలో మిగిలిన అవశేషాలు కనిపిస్తాయని, అక్కడి వేదనని అర్థం చేసుకోవడానికి ఈ టెక్నిక్ ని అవలంబిస్తానని చెప్తాడు. కేరళకి చెందిన జయలక్ష్మిరాజ్ శరీరాన్ని లింగ వివక్షని, లైంగికత్వాన్ని ప్రశ్నిస్తూ, నార్మల్ అనే చట్రంలో బిగించడం వల్ల కొన్ని జీవితాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతాయో చూపించడానికి పెద్ద బొమ్మల్ని ప్రదర్శించింది.
ప్రకటించని సామాజిక వెలివేతను చిత్రిస్తే..
సిరాతో రాసిన అబద్ధాలు రక్తంతో రాసిన వాస్తవాలని కప్పిపుచ్చలేవు అనే లూసన్ మాటల్ని రుజువు చేస్తాడు తెలంగాణకి చెందిన వినాయక్ సుంకేకర్. ‘కళని ప్రదర్శించాలంటే జీవితాన్ని అధ్యయనం చేయాలి’ అని, ‘కళాకారుడు ప్రశ్నించాలే తప్ప జవాబులివ్వకూడదు’ చేకోవ్ సూత్రాలని ఆయన గొప్పగా ప్రతిష్ఠిస్తున్నాడు. తన తాత జీవితం నుంచి నేర్చుకున్న పాఠాలను నేర్పుగా ప్రదర్శిస్తాడు. పెయింటింగ్, ప్రింట్స్, సెరామిక్స్, టెర్రాకోటా డోర్ మాట్లు, చెప్పుల ప్రింట్ లతో తాత చెప్పులు కుట్టే వృత్తిని చూపిస్తూ, చుట్టి పెట్టిన తోలు పట్టీలలో జ్ఞాపకాలని బంధిస్తూ, ఎదురుగా కనిపించే వాస్తవం వెనక దాగి ఉన్న ఇప్పటికీ కనపడని హింసని, వినిపించని అమానవీయతని, ప్రకటించని సామాజిక వెలివేతని ప్రకటిస్తాడు.
అల్లిక నిపుణుల జీవితాల వ్యథ
కేరళకి చెందిన అనుపమ సుకుమార్ పారిశ్రామికీకరణ వల్ల కనుమరుగవుతున్న వెదురు అల్లిక నిపుణుల జీవితాలను నిలబెట్టవలసిన అత్యవసర ఆవశ్యకతని గుర్తు చేస్తుంది. అదృశ్యమవుతున్న ఆ కళని, తన జ్ఞాపకాలని కలబోస్తూ, వెదురు గుజ్జుతో తనకు తెలిసిన జీవితాన్ని, ప్రతిఘటనని, దుర్మార్గాలను, ఓర్పుని, సామూహిక జ్ఞాపకాన్ని చిత్రించింది. కరోనా సమయంలో వలస కార్మికుల వేదనని చూసి గుండె తరుక్కుపోని వారు వుండరు. ఇలాంటి వేదనని బంగ్లాదేశ్ కి చెందిన సదియా షర్మిన్ మళ్ళీ గుర్తు చేస్తారు. ముక్కలైన జ్ఞాపకాలతో, మాసిపోతున్న చిత్రాలతో తన బాధని వివరిస్తుంది. నల్ల చెక్కతో చేసిన మొండెం మీద నిలబెట్టిన చెక్క పెట్టెలో బందీ అయిన వలస కార్మికుడి బొమ్మ చాలా భావయుక్తంగా వుంది, కదలించి వేస్తుంది.
అప్రకటిత అత్యవసర పరిస్థితిపై కళారూపం
కేరళకి చెందిన ఆనందు రాజన్ సమాజాన్ని పీడిస్తున్న పేదరికాన్ని, కులం, మతం, వర్ణం, వర్గాన్ని ప్రశ్నిస్తూ, రోజువారి వస్తువులతో వ్యత్యాసాల చరిత్రని, అట్టడుగు వర్గాల బాధని వ్యక్తీకరిస్తాడు. తెగిన చేయి, ఇనుప కంచె, కత్తి, తెగిపడిన బొటన వేలు వంటి ప్రతీకలతో అసమానతలని చూపిస్తాడు. నేటి అప్రకటిత అత్యవసర పరిస్థితిని, నిషేధాలని కళాత్మకంగా వివరిస్తూ, నాలుగు నాలుకలని ప్రదర్శించారు. ఒకదాన్ని తాళ్ళతో కట్టేస్తే, ఒకదాన్ని ఇనుప ముళ్ళ తీగ చుట్టేస్తుంది, ఒక దాన్ని ఇనుపశీల నియంత్రిస్తే, మరొక దాన్ని కత్తితో కత్తిరిస్తారు. చూడగానే ఒళ్ళు గగుర్పొడిచే ఈ దృశ్యం నుంచి తల పక్కకి తిప్పితే, పంజరంలో అస్తిపంజర అవశేషాలు కనిపిస్తాయి!
ప్రశ్నలని రేకెత్తించిన అపురూప కళాఖండాలు
ఇవి కాక, రాళ్ళ మీద, చెట్ల పీచు మీద, స్త్రీలు వాడే రోజువారి వస్తువుల మీద, పురావస్తు అవశేషాలు చెప్పే చరిత్ర మీద, వాడిపడేసిన పాత రేకుల మీద చెక్కిన బొమ్మలతో చిత్రించిన జీవితాల మీద ఎన్నో పరిశోధనాత్మక కళాఖండాలు ప్రదర్శించారు. మండు వేసవిలో చల్లని విడిదిలాంటి ఆవరణలో పరిచిన ఈ కళాఖండాలు ఎన్నో ప్రశ్నలని రేకెత్తించాయి. ‘కళ అనేది అమూర్తం కాకూడదని, అది ప్రజల జీవన వాస్తవాలని ప్రతిఫలించాలని, కళ కళ కోసం కాదని, దానికి సామాజిక ప్రయోజనం వుండాలని’ చెప్పే మాక్సిం గోర్కి మాటలు ఆ రోజు ఆక్కడ ప్రతిధ్వనించాయి. ‘వ్యక్తిగత, వైయుక్తిక అనుభవాలని, అనుభూతులని మేళవించి, సార్వత్రిక సత్యాన్ని వెలికితీసి, ఆ భావాలని వ్యక్తపరుస్తూ, అందరి స్థాయిని పెంచుతూ, సమాజాన్ని ఉద్ధరించే లక్ష్యాన్ని భుజాన వేసుకున్న’ ఈ కళాకారులందరూ అభినందనీయులు!
డాక్టర్ టి.నళిని
Family medicine speciality centre
94414 26452






