ర్యాబిస్ వ్యాధికి మందులు లేవు.. నివారణే మార్గం

by Batti.Sumithra |

ర్యాబిస్ వ్యాధికి చికిత్స లేదని, నివారణే ఏకైక మార్గమని కామారెడ్డి జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి డా. భరత్ కుమార్ తెలిపారు.

ర్యాబిస్ వ్యాధికి మందులు లేవు.. నివారణే మార్గం
X

దిశ, కామారెడ్డి రూరల్ : ర్యాబిస్ వ్యాధికి చికిత్స లేదని, నివారణే ఏకైక మార్గమని కామారెడ్డి జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి డా. భరత్ కుమార్ తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి ఏరియా పశు వైద్యశాలలో శునకాలకు యాంటీ ర్యాబిస్ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాబిస్ ఒక ప్రాణాంతక వ్యాధి అని, వ్యాధి లక్షణాలు కనిపించిన తర్వాత చికిత్స అందుబాటులో ఉండదని చెప్పారు. అందువల్ల నివారణ చర్యలే అత్యంత ప్రభావవంతమైన మార్గమని పేర్కొన్నారు. జూనోసిస్ వ్యాధులు అంటే జంతువుల నుంచి మనుషులకు, అలాగే మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులని వివరించారు.

ముఖ్యమైన జూనోటిక్ వ్యాధుల్లో ర్యాబిస్, ఆంథ్రాక్స్, బ్రుసెల్లోసిస్, క్షయవ్యాధి (టీబీ), ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్ ఫ్లూ), లెప్టోస్పిరోసిస్ తదితర వ్యాధులు ఉన్నాయని తెలిపారు. కుక్కలు, పిల్లులు, కోతులు వంటి జంతువుల కాట్లు లేదా గాయాల ద్వారా ర్యాబిస్ మనుషులకు సంక్రమించే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల పెంపుడు కుక్కలు, పిల్లులను పెంచుకునే ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా యాంటీ ర్యాబిస్ టీకా వేయించాలని సూచించారు. కామారెడ్డి ఏరియా పశు వైద్యశాలలో యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉందని, పెంపుడు శునకాలకు ఉచితంగా టీకాలు వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏడీ డా. దేవేందర్, ఇన్‌చార్జి పశు వైద్యాధికారి డా. రవికిరణ్, పలువురు జంతు ప్రేమికులు తమ పెంపుడు శునకాలతో కలిసి పాల్గొన్నారు.

Next Story