- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాత్రికి రాత్రే విచారణ..!
జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకున్న నవజాత శిశువు మృతి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

దిశ, జహీరాబాద్: జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకున్న నవజాత శిశువు మృతి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా స్పందించారు. మంత్రి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఉన్నత స్థాయి కమిటీ, ఆదివారం అర్ధరాత్రి ఆసుపత్రికి చేరుకుని రాత్రికి రాత్రే సుదీర్ఘ విచారణ చేపట్టింది. పసిబాలుడి మృతికి గల కారణాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య బృందం, ఆదివారం అర్ధరాత్రి ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించింది. సోమవారం తెల్లవారుజాము వరకు ఈ విచారణ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. విచారణలో భాగంగా కమిటీ సభ్యులు పలు కీలక అంశాలపై దృష్టి సారించారు. ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ లను కమిటీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. చివరగా బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి నుండి పూర్తి వివరాలను, ఆరోపణలను కమిటీ సేకరించింది. ప్రసవ సమయం నాటి వైద్య నివేదికలను, చికిత్స అందించిన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
మంత్రి ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి విచారణ కమిటీలో రాష్ట్ర స్థాయి నిపుణులైన వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. గాంధీ ఆసుపత్రి గైనకాలజీ యూనిట్ హెచ్ఓడి డాక్టర్.శోభ, మహేశ్వరం మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్. అనిత, డీసీహెచ్ఎస్ డాక్టర్.కవిత, టీజీ ఎంఎస్ ఐడీసీ ఈఈ.నరేందర్ లున్నారు.
నివేదిక ఫలితంకై నిరీక్షణ..
సమగ్ర విచారణ అనంతరం కమిటీ సభ్యులు ఒక ప్రత్యేక తుది నివేదికను సిద్ధం చేశారు. దీనిని నేడు ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని ఆసుపత్రి వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బాధిత కుటుంబం మాత్రం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. కాగా ఉన్నతస్థాయి విచారణ కమిటీ నివేదికలో వైద్యులు లేదా సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇదివరకే మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అందరి చూపు నివేదికపైనే ఉంది.






