దేశ సమగ్రత కోసం పోరాడిన మహనీయుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ..

by Taduka Kalyani |

దేశ సమైక్యత, జాతీయ సమగ్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని,

దేశ సమగ్రత కోసం పోరాడిన మహనీయుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ..
X

దిశ, రాంనగర్: దేశ సమైక్యత, జాతీయ సమగ్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని, ఆయన చేసిన త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌ లోని రాంనగర్‌లో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండరాదు” అనే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నినాదం దేశ ఐక్యతకు మార్గదర్శకంగా నిలిచిందని దత్తాత్రేయ అన్నారు.

భారతీయ జనసంఘ్ రూపంలో ఆయన నాటిన చిన్న విత్తనం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అనే మహావృక్షంగా ఎదిగిందని పేర్కొన్నారు. దేశభక్తి, జాతీయత, సేవా భావం అనే ఆయన ఆదర్శాలను కోట్లాది కార్యకర్తలు కొనసాగిస్తున్నారని చెప్పారు. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలను సాకారం చేసిందని అభివర్ణించారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన పోరాటానికి అదే నిజమైన నివాళి అని అన్నారు. ప్రస్తుత తరం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితం, దేశభక్తి, త్యాగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాయి కృష్ణ యాదవ్, ఎంసీ మోహన్, కుండిన్య ప్రసాద్, శోభా ఠాకూర్‌తో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story