కేంద్ర హోంశాఖ పరిధిలో మూడు కీలక విభాగాలకు కొత్త బాధ్యతలు!

by Malleboina Mahesh |

కేంద్రంలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలు.. బీపీఆర్&డీ డీజీగా అలోక్ కుమార్ మిట్టల్, ఎన్‌సీఆర్‌బీ డైరెక్టర్‌గా అమిత్ గార్గ్, పోలీస్ అకాడమీ (SVPNPA) చీఫ్‌గా సుజీత్ పాండే!

కేంద్ర హోంశాఖ పరిధిలో మూడు కీలక విభాగాలకు కొత్త బాధ్యతలు!
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోంశాఖ పరిధిలోని మూడు ప్రముఖ విభాగాలకు సీనియర్ ఐపీఎస్ అధికారులను అధిపతులుగా నియమిస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలోని అత్యున్నత పోలీసు శిక్షణ, పరిశోధనా సంస్థల నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వ నియామకాల కమిటీ (ACC) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా 1993 బ్యాచ్‌కు చెందిన హర్యానా క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ మిట్టల్‌ను ‘బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్’ (BPR&D) డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. ఆయన ఈ పదవిలో తన పదవీ విరమణ తేదీ అయిన జూన్ 30, 2029 వరకు కొనసాగనున్నారు.

ఇదే క్రమంలో అలోక్ కుమార్ మిట్టల్ బ్యాచ్‌మేట్ (1993 బ్యాచ్), ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అమిత్ గార్గ్ ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (NCRB) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ పోస్ట్‌ను తాత్కాలికంగా డీజీ స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే 1994 బ్యాచ్‌ ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ సుజీత్ పాండే హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ‘సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ’ (SVPNPA) డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. పోలీస్ వ్యవస్థలో పరిశోధనలు, నేరాల రికార్డుల నమోదు, కాబోయే ఐపీఎస్ అధికారుల శిక్షణ వంటి అత్యంత కీలకమైన విభాగాలకు ఈ ముగ్గురు సీనియర్ అధికారులను నియమించడం ద్వారా కేంద్రం అంతర్గత భద్రతా యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసింది.

Next Story