కైగా అణు విద్యుత్ ప్రాజెక్టులో ‘మేఘా’ సరికొత్త రికార్డు!

by Naga Rani Yarlagadda |

దేశీయ అణు విద్యుత్ నిర్మాణ రంగంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) సరికొత్త చరిత్ర సృష్టించింది.

కైగా అణు విద్యుత్ ప్రాజెక్టులో ‘మేఘా’ సరికొత్త రికార్డు!
X
  • ఎన్‌పీసీఐఎల్ చరిత్రలోనే అతిపెద్ద ‘కాంక్రీట్ పోర్’ పూర్తి
  • తొలి అణు ప్రాజెక్టులోనే ఎంఈఐఎల్ ఘనత

దిశ, తెలంగాణ బ్యూరో : దేశీయ అణు విద్యుత్ నిర్మాణ రంగంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) సరికొత్త చరిత్ర సృష్టించింది. కర్ణాటకలోని కైగా అణు విద్యుత్ కేంద్రం 5, 6 యూనిట్ల నిర్మాణంలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అక్కడ నిర్మిస్తున్న ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ (పీహెచ్‌డబ్ల్యూఆర్‌) కోసం అణు విద్యుత్ సంస్థ (ఎన్‌పీసీఐఎల్‌) చరిత్రలోనే అత్యంత భారీ మోనోలిథిక్ కాంక్రీట్ పోర్లలో ఒకదాన్ని పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది.

తొలి అడుగులోనే సాంకేతిక అద్భుతం

అణు విద్యుత్ రంగంలో ఎంఈఐఎల్‌కు ఇదే తొలి ప్రాజెక్టు కావడం విశేషం. మొదటి ప్రయత్నంలోనే ఇంతటి భారీ, సంక్లిష్టమైన పనులను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా సంస్థ తన అసాధారణ సాంకేతిక నైపుణ్యాన్ని నిరూపించుకుంది. పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా గంటకు 360 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల కాంక్రీట్ ఉత్పత్తి వ్యవస్థను, గంటకు 340 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల పంపులను వినియోగించారు. ముడి పదార్థాల కొరత రాకుండా 2,600 మెట్రిక్ టన్నుల సిమెంట్, ఫ్లై యాష్ నిల్వలను ముందే సిద్ధం చేసుకున్నారు.

భారీ వర్షాలను ఎదుర్కొని.. రాత్రింబవళ్లు శ్రమించి..

కైగా ప్రాంతం మారుమూల అటవీ ప్రాంతంలో ఉండటం, రవాణా ఇబ్బందులు, తోడుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎంఈఐఎల్ ఇంజనీర్లు అద్భుతమైన చాకచక్యం ప్రదర్శించారు. వర్షం వల్ల పనులకు ఆటంకం కలగకుండా 75 మీటర్ల వ్యాసంతో కూడిన ఒక ప్రత్యేక 'వర్ష రక్షణ వ్యవస్థ' (రెయిన్ ప్రొటెక్షన్ షెల్టర్)ను రూపొందించారు. దీనివల్ల వర్షంలోనూ కాంక్రీట్ నాణ్యత, కార్మికుల భద్రత దెబ్బతినకుండా పనులు సాగాయి. అణు విద్యుత్ నియంత్రణ మండలి కఠిన ప్రమాణాల ప్రకారం క్వాలిటీ అష్యూరెన్స్ (క్యూఏ), క్వాలిటీ కంట్రోల్ (క్యూసీ) పరీక్షలను నిర్వహిస్తూ వందలాది మంది ఇంజనీర్లు, టెక్నీషియన్లు, కార్మికులు పలు షిఫ్టుల్లో రాత్రింబవళ్లు శ్రమించి ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించారు.

స్వచ్ఛ ఇంధన సాధనలో భాగస్వామ్యం గర్వకారణం: ఎంఈఐఎల్

ఈ విజయంతో కైగా 5, 6 యూనిట్ల నిర్మాణం అత్యంత కీలక దశకు చేరుకుందని ఎంఈఐఎల్ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఇలాంటి అత్యంత క్లిష్టమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను విజయవంతంగా నిర్మించగలమని మరోసారి నిరూపితమైందన్నారు. దేశీయ అణు విద్యుత్ రంగాన్ని వేగవంతం చేస్తూ, స్వచ్ఛమైన ఇంధన లక్ష్యాల సాధనలో భాగస్వామి కావడం తమకు ఎంతో గర్వకారణమని, భవిష్యత్తులో ఈ అనుభవం మరిన్ని పెద్ద ప్రాజెక్టుల సాధనకు బాటలు వేస్తుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.

అంకెల్లో భారీ మైలురాయి

మొత్తం కాంక్రీట్: సుమారు 7,250 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను నిరంతరాయంగా పోశారు.

రీబార్ సాంద్రత: ప్రతి క్యూబిక్ మీటరుకు 360 కిలోగ్రాముల అత్యంత కఠినమైన సాంద్రతను పాటించారు.

ఉష్ణోగ్రత నియంత్రణ: కాంక్రీట్ నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు దాని ఉష్ణోగ్రతను 19 డిగ్రీల సెల్సియస్ వద్దే స్థిరంగా నిర్వహించారు.

ఐస్ ప్లాంట్ల ఏర్పాటు: మిశ్రమాన్ని చల్లగా ఉంచేందుకు రోజుకు 510 టన్నుల ఐస్ తయారీ సామర్థ్యం, 400 మెట్రిక్ టన్నుల ఐస్ నిల్వ సామర్థ్యాన్ని ప్రాజెక్ట్ సైట్ వద్దే ఏర్పాటు చేశారు.

Next Story