- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోల్కొండలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా, వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు స్పష్టం చేశారు.

దిశ, కార్వాన్ : తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా, వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక నిధులతో ఈ ఉత్సవాలను వైభవంగా జరుపుతామన్నారు. కోట గర్భగుడికి వచ్చే భక్తులకు, ముఖ్యంగా మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా ఈ సమావేశంలో పాల్గొనీ మాట్లాడుతూ.. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వచ్చే మహిళా భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ: తోపులాటలు జరగకుండా, భక్తులు ఇబ్బంది పడకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. అడిషనల్ సీపీ ఇక్బాల్ మాట్లాడుతూ.. గోల్కొండ బోనాల ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి భారీ ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారని, అందుకు అనుగుణంగానే భారీ పోలీస్ బందోబస్తును రంగంలోకి దించుతున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు.
గుంతలు పూడ్చాలని స్థానికుల వినతి
గోల్కొండ బోనాల ఉత్సవాల నేపథ్యంలో లంగర్ హౌస్ చౌరస్తా మీదుగా భారీగా భక్తుల రాకపోకలు సాగుతాయని, అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న గుంతల వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు అధికారుల దృష్టికి తెచ్చారు. వెంటనే ఆ గుంతలను పూడ్చి రోడ్డును పునరుద్ధరించాలని వారు కోరారు. ఈ సమన్వయ సమావేశంలో జలమండలి, విద్యుత్ శాఖ, జీహెచ్‌ఎంసీ దేవాదాయ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






