డంపింగ్ యార్డ్‌లో వ్యర్థాల నిర్వహణ అభినందననీయం

by Taduka Kalyani |

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్‌లో ఘన వ్యర్ధాల నిర్వహణఅభినందనీయమని జగిత్యాల జిల్లా రాయికర్ మున్సిపాలిటీ బృందం పేర్కొన్నారు.

డంపింగ్ యార్డ్‌లో  వ్యర్థాల నిర్వహణ అభినందననీయం
X

దిశ, ఖమ్మం కార్పొరేషన్ : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్‌లో ఘన వ్యర్ధాల నిర్వహణఅభినందనీయమని జగిత్యాల జిల్లా రాయికర్ మున్సిపాలిటీ బృందం పేర్కొన్నారు. సోమవారం సదర్ బృందం ఖమ్మం కార్పొరేషన్ ని సందర్శించి అక్కడ అమలు చేస్తున్న ఘన వ్యర్థాల నిర్వహణ విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.. డీఆర్‌సీసీ కేంద్రంలో పొడి వ్యర్థాల సేకరణ, వర్గీకరణ, రీసైక్లింగ్‌కు పంపించే విధానాన్ని వారికి ఖమ్మం అధికారులు వివరించారు. అలాగే తడి వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసి సేంద్రీయ ఎరువుగా తయారు చేస్తున్న విధానాన్ని బృందం ఆసక్తిగా పరిశీలించింది. డంపింగ్ యార్డ్‌లో కొనసాగుతున్న బయో-మైనింగ్ ప్రక్రియను పరిశీలించిన బృందం, సుమారు 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను తొలగించి 22 ఎకరాల భూమిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడం పట్ల అభినందనలు తెలిపారు. రీక్లెయిమ్ చేసిన భూమిలో మినీ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేయడం, బయో-సాయిల్‌ను నగరంలోని పార్కులు, డివైడర్లలో వినియోగించడం, ఆర్డీఫ్ ను సిమెంట్ పరిశ్రమలకు తరలించడం వంటి చర్యలను ప్రశంసించింది. ఇలాంటి శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ విధానాలను తమ మున్సిపాలిటీలో కూడా అమలు చేసేందుకు కృషి చేస్తామని చైర్మన్ కట్కం రవి తెలిపారు.

అనంతరం బృందం ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ను సందర్శించారు. నగరంలోని సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరించే ఫీకల్ స్లడ్జ్‌ను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా నిర్వహిస్తున్న విధానాన్ని అధికారులు వివరించారు. ప్లాంట్‌లో వ్యర్థ జలాల శుద్ధి, ఘన,ద్రవ వ్యర్థాల వేరు చేయడం, శుద్ధి అనంతరం పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న ప్రక్రియలను బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. పారిశుధ్య నిర్వహణలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అనుసరిస్తున్న ఆధునిక విధానాలు ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని బృందం అభిప్రాయపడింది.పర్యటనలో భాగంగా బృందం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 54వ డివిజన్‌లో అభివృద్ధి చేసిన ఎన్టీఆర్ పార్క్‌ను సందర్శించింది. పార్కులో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారుల ఆట స్థలాలు, సుందరమైనల్యాండ్‌స్కేపింగ్, పచ్చదనం, పరిశుభ్రమైన నిర్వహణ, సందర్శకులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి బృందం అభినందనలు తెలిపింది. ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా పార్కును అభివృద్ధి చేసిన విధానం తమను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాయికల్ మున్సిపాలిటీ చైర్మన్ కట్కం రవి మాట్లాడుతూ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక వసతులతో పార్కులను అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. ఇదే తరహాలో రాయికల్ మున్సిపాలిటీలో కూడా పచ్చదనానికి పెద్దపీట వేస్తూ వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, చిన్నారుల ఆట స్థలాలతో కూడిన మోడల్ పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.

Next Story