ఫార్మా రంగంలో తెలంగాణకు మరో మైలురాయి..

by Taduka Kalyani |

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని బయోటెక్ పార్క్ ఫేజ్-III లో సిరో ఫార్మా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన అత్యాధునిక ఆంకాలజీ (క్యాన్సర్) ఔషధాల తయారీ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ,

ఫార్మా రంగంలో తెలంగాణకు మరో మైలురాయి..
X

దిశ, ములుగు: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని బయోటెక్ పార్క్ ఫేజ్-III లో సిరో ఫార్మా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన అత్యాధునిక ఆంకాలజీ (క్యాన్సర్) ఔషధాల తయారీ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం మండల నాయకుల నుండి పరిశోధన, ఉత్పత్తి విభాగాలను పరిశీలించి సంస్థ ప్రతినిధుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఫార్మా రంగంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, హైదరాబాద్ ప్రపంచ స్థాయి ఔషధ పరిశోధన, తయారీ కేంద్రంగా గుర్తింపు పొందిందన్నారు. ఆ గుర్తింపును మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని పేర్కొన్నారు.

క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు నూతన ఔషధ రంగంలో అభివృద్ధి, పరిశోధనలు అత్యంత అవసరమని, అందుకు సిరో ఫార్మా వంటి సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో తయారయ్యే నాణ్యమైన ఔషధాలు రోగులకు అందుబాటులోకి రావడం ద్వారా వైద్య రంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాల కల్పన లోనూ ఇటువంటి పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని, రాష్ట్రంలో మరిన్ని ఔషధ పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మల్లేష్ గౌడ్, స్థానిక సర్పంచ్ కవిత నర్సింలు, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, పరిశ్రమ యొక్క చైర్మన్ గోవిందా రెడ్డి, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story