అయోధ్య విరాళాల చోరీ కేసు.. అఖిలేష్ యాదవ్‌తో నిందితుడు సంప్రదింపులు..!

by Malleboina Mahesh |

అయోధ్య విరాళాల చోరీ కేసు: నిందితుడు టిన్నూ యాదవ్‌కు అఖిలేష్ యాదవ్‌తో ఫోన్ లింకులు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు కలకలంగా మారాయి.

అయోధ్య విరాళాల చోరీ కేసు.. అఖిలేష్ యాదవ్‌తో నిందితుడు సంప్రదింపులు..!
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రామ శంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్‌తో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు ఫోన్ కాల్ డేటా (CDR) ద్వారా తేలినట్లు తెలుస్తుంది. నిందితుడు గత ఏడాది కాలంగా అఖిలేష్ యాదవ్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని, రోజుకు కనీసం రెండు సార్లు ఆయనతో ఫోన్‌లో మాట్లాడేవాడని, అలాగే పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందు రోజు ఏకంగా మూడు సార్లు మాట్లాడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఆలయంలో జరుగుతున్న ఈ విరాళాల చోరీ వ్యవహారం అఖిలేష్ యాదవ్‌కు ముందే తెలుసని, అయితే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో.. దీనిని రాజకీయంగా వాడుకునేందుకు ఇప్పుడు బయటపెట్టారనే చర్చ నడుస్తోంది.

అయితే, అధికారికంగా దర్యాప్తు సంస్థలు గానీ, యూపీ పోలీసులు కానీ ఈ కాల్ డేటా లీకేజీ, అఖిలేష్ యాదవ్‌తో నిందితుడికి ఉన్న లింకులపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిజానికి, ఈ కేసులో అరెస్ట్ అయిన టిన్నూ యాదవ్.. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌కు గత 20 ఏళ్లుగా నమ్మకమైన డ్రైవర్‌గా, అనుచరుడిగా పనిచేశాడని రికార్డులు చెబుతున్నాయి. ఆలయ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పనిచేస్తున్న అతను.. కౌంటింగ్ రూమ్ తాళాలు కలిగి ఉండి, నిఘా నేత్రాల కన్నుగప్పి ఇతర నిందితులతో కలిసి రూ. 80 లక్షల వరకు నగదు, నగలను పక్కదారి పట్టించినట్లు సిట్ (SIT) ప్రాథమిక విచారణలో తేలింది. కోట్లాది మంది నమ్మకం తో ముడిపడి ఉన్న విరాళాల సొమ్ము మాయమవ్వడంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో.. నిందితుడికి, ఆయనకు ముడిపెడుతూ వస్తున్న ఈ వార్తలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Next Story