- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శరవేగంగా డబుల్ రోడ్డు విస్తరణ పనులు..!
మంగపేట మండలం కేంద్ర ప్రజల చిరకాల వాంచగా ఉన్న సెంట్రల్ లైటింగ్ రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

దిశ, మంగపేట: మంగపేట మండలం కేంద్ర ప్రజల చిరకాల వాంచగా ఉన్న సెంట్రల్ లైటింగ్ రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 మే 1న మంత్రి సీతక్క పనులకు శంకుస్థాపన చేయగా కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టి వడి వడిగా చేస్తున్నారు. 2015 పుష్కరాల సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ అండ్ బి రోడ్డు నుండి గోదావరి పుష్కర ఘాట్ వరకు సుమారు 3 కోట్లతో సీసీ రోడ్డు పనులు చేపట్టింది. పుష్కరాలు దగ్గర పడడంతో హడావుడిగా జరిగిన పనుల్లో నాణ్యత లేకపోవడంతో రోడ్డు రెండు మూడేళ్లకే పాడైపోగా నాటి నుంచి మండల ప్రజలకు సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రంలో పెరిగిన వాణిజ్య అవసరాలకు తగ్గట్టుగా రోడ్డు లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు, బ్యాంకు, ఆన్ లైన్, మీ సేవ, పోలీస్ స్టేషన్, ఫారెస్ట్, వైద్య ఆరోగ్యం, ఉన్నత విద్య, మహిళా సంఘాలు, విద్యుత్ అవసరాలు ఇలా ప్రతి పని కోసం మండల కేంద్రానికి వచ్చే 25 పంచాయతీల ప్రజలు 11 సంవత్సరాలుగా మండల కేంద్రంలో సరైన రోడ్డు లేక అవస్థలు పడుతున్నారు.
నాటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క ఈ విషయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ రోడ్డు విస్తరణ పనులు, బస్టాండ్, పుష్కర ఘాట్ నిర్మాణం చేయిస్తానంటూ హామీలు ఇచ్చారు. 2024 డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ములుగు ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో గెలిచిన ఉన్న సీతక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తనకిష్టమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మండల ప్రజల ఆశలు నెరవేరినట్లుగా భావించారు. ఇచ్చిన మాట కోసం మంత్రి సీతక్క మే నెలలో జరిగిన మండల పర్యటన సందర్బంగా పంచాయతీరాజ్ విభాగంలోని కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ నిధుల నుండి 2.93 కోట్ల నిధులు సాంక్షన్ చేయడంతో పనులు పొందిన గుత్తేదారు శరవేగంగా పనులు మొదలుపెట్టారు.
తీరిన చిరకాల కోరిక: బీర్మోటా శాంతాదేవి(గృహిణి)
పాడైన గుంతలతో ఉన్న ఇరుకు రోడ్డుతో 15 సంవత్సరాలు గోస పడ్డాం. మా గోసను విన్న మంత్రి సీతక్క మా చిరకాల వాంఛ అయిన సెంట్రల్ లైటింగ్, రోడ్డు వైడనింగ్ పనులకు నిధులు మంజూరు చేసి వచ్చే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని రోడ్డు వెడల్పు పనులు ముందుగానే చేస్తున్నందుకు మా ఊరిందరి తరపున మంత్రి సీతక్కకు ధన్యవాదాలు. పుష్కరఘాట్ కూడా పాత పుష్కర ఘాట్ దగ్గరనే కట్టాలి ప్రజలకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు బాగుంటాయి. 12 సంవత్సరాల క్రితం అక్కడ కట్టిన పుష్కరఘాట్ వల్ల దేశంలోనే మంగపేటకు మంచి ప్రాచుర్యం లభించింది. మంత్రి సీతక్క పుష్కరఘాట్ సందర్శించి పాత పుష్కర ఘాట్ ను పునరుద్దరిస్తే తక్కువ నిధులతో పనులు పూర్తవుతాయి.
రోడ్డు విస్తరణ సెట్రల్ లైటింగ్ తో అభివృద్ధి : దాగం శ్యామ్ ( బార్బర్)
మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులతో మండల కేంద్రం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని మండల కేంద్రాలు అభివృద్ధి చెందినా మంగపేట మండల కేంద్రం అభివృద్ధికి నోచుకోలేదు. మంత్రి సీతక్క చొరవతో డబుల్ లైన్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులు శరవేగంగా జరుగుతుండడంతో గ్రామానికి కళ వచ్చింది. ఈ పనులను అధికారులు ప్రజల సహకారంతో గౌరారం వాగు కొత్త బ్రిడ్జి వరకు పొడిగించితే బాగుంటుంది. బస్సులు పాత పద్ధతిలో బస్టాండ్ వరకు నడిపించాలి.






