కాలనీల్లో ఇంటింటి ప్రచారాలు.. అప్రమత్తమైన నివాసితులు

by Batti.Sumithra |

చంపాపేట్ డివిజన్ పరిధిలో మారుతీ నగర్, భవాని నగర్ కాలనీల్లో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఒక ఘటన స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.

కాలనీల్లో ఇంటింటి ప్రచారాలు.. అప్రమత్తమైన నివాసితులు
X

దిశ, చంపాపేట్ : చంపాపేట్ డివిజన్ పరిధిలో మారుతీ నగర్, భవాని నగర్ కాలనీల్లో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఒక ఘటన స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు వ్యక్తులు గుంపులుగా ఏర్పడి నివాస గృహాలను సందర్శిస్తూ మతపరమైన కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. అనుమతి లేకుండా ఇళ్లలోకి ప్రవేశించి ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో కాలనీవాసులు వారిని అడ్డుకున్నారు. మారుతీనగర్ కాలనీ మాజీ అధ్యక్షుడు రమేష్ ఉదయం వాకింగ్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటనను గమనించినట్లు సమాచారం. వెంటనే సంబంధిత వ్యక్తులను ప్రశ్నించి, కాలనీవాసుల అనుమతి లేకుండా గృహాల్లోకి వెళ్లడం సరికాదని సూచించినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇదే తరహా ఘటన సమీప భవానీనగర్ కాలనీలో కూడా చోటుచేసుకోవడంతో అక్కడి నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో మారుతీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీవాసులకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. కాలనీలోకి వచ్చే అపరిచిత వ్యక్తుల కదలికలను గమనించాలని, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు లేదా కాలనీ సంఘ ప్రతినిధులకు సమాచారం అందించాలని కోరింది. అయితే, మత ప్రచారం రాజ్యాంగ బద్ధమైన హక్కు అయినప్పటికీ, అది ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకుండా, వారి అనుమతితోనే జరగాలని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు, ఇటువంటి అంశాలు సామాజిక సామరస్యానికి భంగం కలగకుండా అన్ని వర్గాలు సంయమనంతో వ్యవహరించాలని పలువురు మేధావులు సూచిస్తున్నారు. నగరంలో పెరుగుతున్న జనసాంద్రత, భద్రతా ఆందోళనల నేపథ్యంలో కాలనీల్లోకి వచ్చే వ్యక్తుల వివరాల పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. శాంతి, సామరస్యాలను కాపాడుతూ చట్టబద్ధ మార్గాల్లో సమస్యలను పరిష్కరించుకోవడమే సమాజానికి శ్రేయస్కరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story