విజయవాడ విజయ్ మాల్యా కేశినేని నాని : ఎంపీ చిన్ని సంచలన ఆరోపణలు

by Naga Rani Yarlagadda |

మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని.. సొంత సోదరుడు తనపై చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

విజయవాడ విజయ్ మాల్యా కేశినేని నాని : ఎంపీ చిన్ని సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని.. సొంత సోదరుడు తనపై చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో అతిపెద్ద బ్యాంకు కుంభకోణానికి కేశినేని నాని పాల్పడ్డాడని ఆరోపించారు. IOB బ్యాంక్ అధికారులను ప్రలోభపెట్టి.. నాని రూ.120 కోట్ల అప్పు తీసుకున్నాడని, ఆయన అకౌంట్ కు NPA చేసి 11 ఏళ్లు అయిందన్నారు. విజయవాడ విజయ్ మాల్యా బాగోతాన్ని బయటకు లాగుతానని, తన వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. పనిలేని, పసలేని ఆరోపణలు తాను చేయనన్నారు. ఒక అకౌంట్ కు రూ.91 కోట్లు, రెండో అకౌంట్ కు రూ.23 కోట్ల 70 లక్షల మేర అమౌంట్ రుణం తీసుకున్నారని తెలిపారు. ఈ స్కామ్ కు పాల్పడిన వ్యక్తికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులు లెటర్లు రాసినా స్పందించలేదన్నారు.

బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు.. వరుసగా మూడు వాయిదాలు చెల్లించకపోతే తాకట్టు పెట్టిన ఆస్తుల్ని జప్తుచేసే అధికారం ఉంటుందని, ఆయన సొంతిల్లు, హోటల్ ను తనఖా పెడితే వాటిని బ్యాంక్ అధికారులు ఎందుకు జప్తు చేయలేదని నిలదీశారు. బ్యాంక్ అధికారులు ఎవరితో లాలూచీ పడి ఇంత రుణం ఇచ్చారని ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్నించారు. నాని బ్యాంక్ అకౌంట్లో రూ.7 కోట్లు ఉన్నా ఆటో డెబిట్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. జగన్ మాదిరిగానే.. కేశినేని నాని కూడా దొంగే దొంగ.. దొంగ అని అంటున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ఆరోపణలు చేయడమే అతని పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. దీనిపై పోలీసులు తమ పని చేస్తున్నారన్నారు. ప్రజా ప్రతినిధిగా విజయవాడ ప్రజలకు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మాత్రమే తాను జవాబుదారీనని, నెట్టింట వచ్చే ట్వీట్లకు జవాబుదారీతనం వహించాల్సిన అవసరం తనకు లేదన్నారు.

Next Story