- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ ఆ హామీలు తీరిస్తే.. రాజకీయం వదిలేస్తా: కేటీఆర్ ఛాలెంజ్
రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లయినా.. ఒక్క పనీ పూర్తి చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లయినా.. ఒక్క పనీ పూర్తి చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఖైరతాబాద్ లో ఎస్ఐఆర్ పై నిర్వహించిన శిక్షణ, అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం గరీబోళ్ల పొట్ట కొట్టిందని ఆరోపించారు. హైడ్రా పేరుతో వందల ఇళ్లను కూలగొట్టి, కుటుంబాలను రోడ్డున పడేశారని వాపోయారు. నాడు కేసీఆర్ రెండున్నర లక్షల మందికి ఇళ్ల పట్టాలిస్తే.. రేవంత్ సర్కారు మాత్రం ఉన్న గూడును కూల్చేసిందన్నారు. మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్.. రెండున్నరేళ్లలో డిజాస్టర్ సీఎంగా నిలిచారని విమర్శలు గుప్పించారు. వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.4వేలు పెన్షన్, రెండు లక్షల ఉద్యోగులు, ఆడబిడ్డలకు ఇస్తామని రూ.2500 సహాయం ఏమైందని నిలదీశారు. నోరు తెరిస్తే కోటిమంది మహిళలను కోటీశ్వరుల్ని చేస్తామని ఊదరగొడుతున్న సీఎం రేవంత్.. ఆ ముచ్చట పక్కకు పెట్టి కనీసం వారిని లక్షాధికారులనైనా చేయాలన్నారు. ఆడబిడ్డలకు ఇస్తామన్న నెలకు రూ.2500 ఆర్థిక సహాయం బాకీలతో సహా లక్షన్నర రూపాయలు ఇస్తే.. వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.
మీనాక్షికి సీఎం వెన్నుపోటు..
నాగేందర్ కు ఓటేస్తే నాకేస్తారని ఖైరతాబాద్ ప్రజలకు బాగా తెలుసన్నారు. అందుకే ఇక్కడి ఓటర్లు దానం నాగేందర్ ను చూసి ఓటెయ్యలేదని, కేసీఆర్ ను చూసి ఓటువేశారన్నారు. మీనాక్షి నటరాజన్ ఇష్యూపై కూడా కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. ఆమెకు వెన్నుపోటు పొడిచింది సీఎం రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. రేవంత్ అవినీతిపై మీనాక్షి.. రాహుల్ గాంధీకి రిపోర్ట్ ఇచ్చినందుకు ఆమెపై పగపట్టారని, అందుకే బీజేపీకి లీకులిచ్చి రాజ్యసభ పదవి రాకుండా చేశారని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ పాలనకు సగం టైమ్ ముగిసిందన్న కేటీఆర్.. సీఎం ఫస్టాఫ్ సినిమా డిజాస్టర్ గా నిలిచిందన్నారు. రెండున్నరేళ్లకాలంలో హైదరాబాద్ లో ఒక్క అభివృద్ధి పనీ చేయకపోగా.. ఉన్నవాటినే కూల్చేశారన్నారు. నిజాంల కాలంలో, కేసీఆర్ హయాంలో కట్టిన యూనివర్సిటీలు, ఆస్పత్రులే నేడు ప్రజలకు ఉపయోగపడుతున్నాయన్నారు.






