సినిమా అవకాశాలు దక్కాలంటే కోరిక తీర్చాల్సిందే !

by Batti.Sumithra |

సినిమాల్లో నటించినందుకు హామీ ఇచ్చిన పారితోషికం చెల్లించకుండా, లైంగికంగా వేధించడంతో పాటు ప్రాణహాని బెదిరింపులకు పాల్పడిన కాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్‌ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సినిమా అవకాశాలు దక్కాలంటే కోరిక తీర్చాల్సిందే !
X

దిశ, ఖైరతాబాద్ : సినిమాల్లో నటించినందుకు హామీ ఇచ్చిన పారితోషికం చెల్లించకుండా, లైంగికంగా వేధించడంతో పాటు ప్రాణహాని బెదిరింపులకు పాల్పడిన కాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్‌ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లికి చెందిన 21 ఏళ్ల యువతి సినీ రంగంలో నటిగా అవకాశాలు పొందుతూ ముందుకు సాగుతోంది. ఓ చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర కోసం కాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్ ఆమెను సంప్రదించి, నటించినందుకు రూ.90 వేల పారితోషికం ఇస్తామని హామీ ఇచ్చాడు. షూటింగ్ పూర్తయిన అనంతరం పారితోషికంతో పాటు క్యాబ్ ఖర్చుల కింద మరో రూ.30 వేల రూపాయలు ఇవ్వాలని యువతి కోరింది.

ఈ విషయమై మాట్లాడేందుకు ఫిబ్రవరి 18న సాగర్ సొసైటీ ప్రాంతానికి రావాలని ప్రసాద్ పిలిచినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అక్కడికి వెళ్లిన యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించుకుని అసభ్యంగా ప్రవర్తించాడని, తనకు లొంగిపోతే సినీ రంగంలో మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానంటూ వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఆరోపించింది. అయితే అతని చెర నుంచి తప్పించుకుని బయటపడినట్లు తెలిపింది. ఈ ఘటన పై యువతి తల్లి ప్రసాద్‌ను నిలదీయగా, డబ్బులు ఇచ్చేది లేదని, గతంలో కూడా ఇలాగే పలువురు యువతులను వాడుకుని కోట్ల రూపాయలు సంపాదించానంటూ నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేస్తే తల్లీకూతుళ్లను చంపేస్తానంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన పై దర్యాప్తు చేపట్టారు.

Next Story