సొంత ఊరిపై తనకున్న మమకారాన్ని మరోసారి నిరూపించుకున్న విజయ్ దేవరకొండ

by Pulgam srinivas |

‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరానికి అచ్చంపేట డివిజన్ మెరిట్ స్కాలర్‌షిప్ జాబితాను విడుదల చేశారు.

సొంత ఊరిపై తనకున్న మమకారాన్ని మరోసారి నిరూపించుకున్న విజయ్ దేవరకొండ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ హీరో విజయ్ డెవరకొండ తన సొంత ఊరిపై ఉన్న మమకారాన్ని మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లో కూడా చూపిస్తూ మరోసారి వార్తల్లో నిలిచాడు. కొంతకాలం క్రితం విజయ్ దేవరకొండ తన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటలో కొత్త ఇంటికి గృహప్రవేశం చేసిన సమయంలో, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చాడు. తాజాగా ఆయన చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఆ దిశగా అడుగులు వేయడం విశేషం. విజయ్ దేవరకొండ స్థాపించిన ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన అచ్చంపేట డివిజన్ మెరిట్ స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థుల జాబితాను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 45 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.

ముఖ్యంగా 9వ, 10వ తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించనున్నారు. ఇక తుమ్మన్ పేట జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల నుంచి 9వ తరగతిలో బి. హేమలత ప్రథమ స్థానం, పి. ప్రణీత ద్వితీయ స్థానం సాధించి ఎంపికయ్యారు. అలాగే 10వ తరగతిలో కె. గణేష్ ప్రథమ స్థానం, బి. అనిల్ ద్వితీయ స్థానం సాధించి స్కాలర్‌షిప్‌లకు అర్హత సాధించారు. విజయ్ దేవరకొండ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన విద్యార్థులకు మంచి ప్రోత్సాహం లభించడంతో పాటు, వారి భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story