- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం : మంత్రి బండి సంజయ్ కుమార్
కేంద్రం-రాష్ట్రం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాలు, మండలాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.

దిశ, వేములవాడ టౌన్ : ‘‘రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని, అట్లనే కేంద్రం, రాష్ట్రం కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని, గత ప్రభుత్వ మూర్ఖపు పాలన వల్ల తెలంగాణ చాలా నష్టపోయిందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నందువల్లే గ్రామాలకు మండలానికి కనెక్ట్ చేసేలా కేంద్రం నుంచి తగిన నిధులొస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం వేములవాడ రూరల్ మండలంలోని బొల్లారం గ్రామం వద్ద స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి వేములవాడ -సిరికొండ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా బొల్లారం నుండి సిరికొండ వరకు రూ.23కోట్లతో రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లో భాగంగా వేములవాడ నుండి సిరికొండ వరకు దాదాపు 18.21 కి.మీల మేరకు రోడ్డు విస్తరణ, బలోపేతం చేసే పనులకు ఆది శ్రీనివాస్ కలిసి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని, కేంద్రం సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఈ పనులకు 23 కోట్లు మంజూరు చేసిందని, ఒప్పందం ప్రకారం 6 నెలల్లో ఈ పనులను పూర్తి చేయాలని గడువు విధించినట్లు తెలిపారు.
ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా రహదారి విస్తరణ, బలోపేతంతో పాటు మధ్యమధ్యలో సిమెంట్ కాంక్రీట్ రోడ్ల నిర్మాణం, పైప్ కల్వర్టుల నిర్మాణం, గ్రామాల పరిధిలో సీసీ డ్రైన్ల ఏర్పాటు, రోడ్డు భద్రతా చర్యలకు సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉందని, మామిడిపల్లి, బావుసాయిపేట, రామన్నపల్లి, గోవిందరావుపేట తండా గ్రామాలతోపాటు ఈ రోడ్డు నుండి వెళ్లే ప్రయాణీకులకు, వాహనదారులకు ఎంతో సమయం ఆదా అవుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని, ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత గెలిపించిన ప్రజల కోసం నియోజకవర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.
అనంతరం విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ రోడ్లు ముఖ్యమని, రాష్ట్ర ప్రభుత్వం అడిగిందే తడువుగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు నిధులు కేటాయిస్తుండటం శుభ పరిణామమని అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు అనంతరం అభివృద్ధి పైనే దృష్టి పెడుతున్నమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఇప్పటికే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయిందని, అట్లాగే ఈ ప్రాంతానికి సైనిక్, నవోదయ స్కూల్లో మంజూరు అయ్యేలా కృషి చేయాలని, రోడ్లతోపాటు విద్య పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో కేంద్రమంత్రి అభిప్రాయాన్ని సలహాలు తీసుకున్నామని అన్నారు. వేములవాడ చుట్టూ ఉన్న రోడ్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని, కోరుట్ల- వేములవాడ రోడ్డును మూడు లైన్ల రోడ్డుగా విస్తరిస్తున్నామని, ఈ రోడ్డును నాలుగు లైన్లో రోడ్డుకు సైతం మీ సాయం కావాలని బండిని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.






