నిప్పుతో చెలగాటమాడకు రేవంత్.. చరిత్రలో కనుమరుగవుతావు

by Ratna Kumari |   (  Updated:2026-06-29 16:13:15  IST  )

నిరుద్యోగుల సమస్యలను విస్మరిస్తే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

నిప్పుతో చెలగాటమాడకు రేవంత్.. చరిత్రలో కనుమరుగవుతావు
X

దిశ, చైతన్యపురి : నిరుద్యోగుల సమస్యలను విస్మరిస్తే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ ర‌క్ష‌ణ సేన పార్టీ రాష్ట్ర అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. నిరుద్యోగులతో చేసిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన నిరుద్యోగుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. ముఖ్యంగా కానిస్టేబుల్ నియామకాల విషయంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం 19,200 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని శ్వేతపత్రంలో పేర్కొన్నప్పటికీ, వాటి భర్తీపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే 20 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ఏ సమస్యనైనా స్వీకరిస్తే పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టనని కవిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలకు 33 శాతం ఉద్యోగాలు కల్పించాలని తాను గతంలోనే డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించిన ఆమె, ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను విస్మరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జూలై 2న చేపట్టనున్న సచివాలయ ముట్టడి కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని, నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులతో కలిసి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. 20 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ జరిగే వరకు నిరుద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎండి ఇస్మాయిల్, రవి రాథోడ్, వివేక్, భూక్య కుమార్, ఇంద్రా నాయక్, ఆకాష్, శంకర్ నాయక్, నవీన్ పట్నాయక్, శింబు, వంశీ, ప్రవీణ్, ప్రియాంక సింధురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story