- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మమ్మల్ని ఎన్‌కౌంటర్ చేయకండి సజ్జనార్..! జర్నలిస్టు దొంతు రమేష్ సెన్సేషనల్ కామెంట్స్
ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి, మరికొందరు మహిళా ఐఏఎస్ అధికారులపై పరువుకు భంగం కలిగేలా వార్తా కథనాలు ప్రసారం చేశారనే ఆరోపణలపై ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్, జర్నలిస్టు సుధీర్ అరెస్టు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి, మరికొందరు మహిళా ఐఏఎస్ అధికారులపై పరువుకు భంగం కలిగేలా వార్తా కథనాలు ప్రసారం చేశారనే ఆరోపణలపై ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్, జర్నలిస్టు సుధీర్ అరెస్టు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరిద్దరిపై పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ సరిగా లేదని 14వ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించడమే కాకుండా, వారిని వెంటనే రూ. 20 వేల పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ దొంతు రమేష్ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో రమేష్ మాట్లాడుతూ.. తనపై సీపీ సజ్జనార్ అనేక నిరాధారమైన ఆరోపణలు చేశారని, అప్పుడు తాను పోలీసు కస్టడీలో ఉండటం వల్ల సమాధానం ఇవ్వలేకపోయానని అన్నారు. అడిషనల్ డీజీ కేడర్‌లో ఉన్న సజ్జనార్, మరో ఏడాది రెండేళ్లలో డీజీపీ కావాల్సి ఉందని.. ఎవరో ఒకరిని సంతృప్తి పరచడానికో లేదా ఏదో ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికో తనకు ఇచ్చిన టాస్క్‌లో భాగంగా తనపై లేనిపోని ఆరోపణలు చేశారని విమర్శించారు.
కనీసం నోటీసులైనా ఇచ్చారా..?
సజ్జనార్ విజ్ఞానవంతులని, అరుదైన పోలీసు అధికారిగా కోట్లాది మంది మనసు గెలుచుకున్నారని, అందులో తాను కూడా ఒకడినని రమేష్ పేర్కొన్నారు. వరంగల్ ఎస్పీగా పనిచేసిన కాలం నుంచి గత 18 ఏళ్లుగా తనకు సజ్జనార్ పరిచయమని తెలిపారు. కేసు నమోదైందని తాను పారిపోతున్నానంటూ సీపీ అసత్య ఆరోపణలు చేశారని, తాను పారిపోయే వ్యక్తిని కాదని, అధైర్యవంతుడిని అంతకంటే కాదని స్పష్టం చేశారు. "ఎన్టీవీపై మోపిన కేసులో నాకు కనీసం నోటీసులు ఇచ్చారా? ఇస్తే ఎప్పుడు ఇచ్చారో రుజువులతో సహా చెప్పాలి. కనీసం సీసీఎస్ ఆఫీసుకు రమ్మని ఫోన్ అయినా చేశారా?" అని ప్రశ్నించారు.
పారిపోతున్నానని స్టేట్‌మెంట్లా..
పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వస్తే తానే స్వయంగా సీఈవో దగ్గరకు వెళ్లి నోటీసులు ఇప్పించానని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 12వ తేదీ రాత్రి 7 గంటలకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గురు రాఘవేంద్ర ఎన్టీవీ ఆఫీసుకు వచ్చినప్పుడు తాను కలిశానని, యాంకర్ దేవి స్టేట్‌మెంట్ రికార్డు చేసే సమయంలో తాను సీసీఎస్ టీమ్ పక్కనే ఉన్నానని తెలిపారు. కనీసం అప్పుడు కూడా తన స్టేట్‌మెంట్ తీసుకోలేదని, నోటీసు ఇవ్వలేదని అన్నారు. అరెస్ట్ చేసే రోజు (జనవరి 13) ఉదయం కూడా ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫీసు బయట ఉంటే పలకరించి 'టీ తాగి వెళ్లండి' అని చెప్పానని రమేష్ వివరించారు. తమ వద్ద నోటీసులు ఉన్నాయని కూడా చెప్పకుండా, పారిపోతున్నట్లు సీపీ స్టేట్‌మెంట్ ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్టీవీ ఆఫీసులో, 3 నుంచి 5 గంటల వరకు ప్రజా భవన్‌లో, ఆ తర్వాత సచివాలయంలో ఉన్నానని.. తన సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ కాలేదని స్పష్టం చేశారు.
ఆ విషయం మంత్రి శ్రీధర్ బాబుకు తెలుసు..
తాను వేల కోట్ల ప్రజాధనం దోచుకున్న నీరవ్ మోడీ, విజయ్ మాల్యాని కాను. వృత్తిపరమైన వార్తా కథనం విషయంలో నోటీసు కూడా ఇవ్వకుండా, విదేశాలకు పారిపోతున్నానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అని దొంతు రమేష్ ప్రశ్నించారు. సంక్రాంతి సెలవులకు ఊరికి వెళ్లాలనుకున్నప్పటికీ, ఈ నెల 18 నుంచి దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు కవరేజీకి వెళ్లాల్సి ఉండటంతో ప్లాన్ మార్చుకున్నానని తెలిపారు. అందుకే తన భార్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లి, అక్కడి నుంచి నేరుగా దావోస్ వెళ్లాలని టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన షెన్‌జెన్ వీసా వివరాలను మంత్రి శ్రీధర్ బాబుకు ముందే పంపానని, సిట్ అధికారులకు కూడా చూపించానని పేర్కొన్నారు.
తాము బీసీ, ఎస్సీ వర్గాల వారము కాబట్టే ఇలా వేధిస్తున్నారని దొంతు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. శబరిమలై వెళ్తున్న చారిని 15 గంటల పాటు వేధించారని, సచివాలయం బీట్ చూసే దళిత బిడ్డ సుధీర్‌ను అన్యాయంగా ఈ కేసులోకి లాగారని ఫైర్ అయ్యారు. చివరగా, "మేము రాసిన ఇంకు ఎక్కడ కొనుగోలు చేశారో చెప్పాలని సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ పేరుతో మమ్మల్ని పంజాగుట్ట చౌరస్తాకు తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేయకండి" అంటూ దొంతు రమేష్ చురకలంటించారు.






