అడుక్కుంటూ సీఎం సహాయనిధికి లక్షలాది రూపాయల డొనేషన్

by Muthe.Rajitha |

తాను ఓ వైపు అడుక్కుంటున్నా, తన ఆకలి బాధల కంటే తోటివారికి సాయం చేయాలనే పెద్ద మనసు చాటుకుంటున్నారు ఒక వృద్ధుడు.

అడుక్కుంటూ సీఎం సహాయనిధికి లక్షలాది రూపాయల డొనేషన్
X

దిశ, వెబ్ డెస్క్ : తాను ఓ వైపు అడుక్కుంటున్నా, తన ఆకలి బాధల కంటే తోటివారికి సాయం చేయాలనే పెద్ద మనసు చాటుకుంటున్నారు తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు. తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళం ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల పూల్‌పాండియన్‌ గతంలో ముంబైలో ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు అయిపోవడం, భార్య మరణించడంతో ఒంటరిగా మారిన ఆయన 2019లో తమిళనాడుకు తిరిగి వచ్చేశారు. జీవనోపాధి కోసం అప్పటి నుంచి పలు జిల్లాలతో పాటు బెంగళూరులోనూ భిక్షాటన చేయడం ప్రారంభించారు. అయితే, భిక్షాటన ద్వారా తనకు వచ్చిన సొమ్మును స్వార్థానికి వాడుకోకుండా, వారానికి లేదా నెలకోసారి కొంత పెద్దమొత్తం సమకూరగానే స్థానిక జిల్లా కలెక్టర్లను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించడం అలవాటుగా మార్చుకున్నారు.

ఆయన దాతృత్వం ఏ స్థాయిదంటే.. కరోనా కష్టకాలంలో మదురై కలెక్టర్‌ను కలిసి ఏకంగా రూ. 50 వేల భారీ విరాళాన్ని అందించారు. ఇటీవలే మే 18న మదురై వచ్చిన ఆయన రూ. 10 వేలు కలెక్టర్‌కు ఇవ్వగా, సరిగ్గా వారం తిరగకముందే మే 25న మరో రూ. 10 వేలను సహాయ నిధికి అందజేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదంతా తాను భిక్షాటన ద్వారా సేకరించిన సొమ్మేనని ఆయన మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు ఇలా భిక్షాటన ద్వారా వచ్చిన లక్షలాది రూపాయలను పూల్‌పాండియన్‌ వివిధ సేవా కార్యక్రమాలకు, ప్రభుత్వ సహాయ నిధులకు అందించారు. కేవలం ముఖ్యమంత్రి సహాయ నిధికే కాకుండా, పేద విద్యార్థుల కోసం పలు ప్రభుత్వ పాఠశాలలకు కూడా తగిన ఆర్థిక సాయం అందించానని ఆయన గర్వంగా చెబుతున్నారు. సమాజంలో ఆస్తులు ఉన్నవారే సాయం చేయడానికి వెనుకాడుతున్న ఈ రోజుల్లో, ఏమీ లేని ఒక యాచకుడు లక్షలాది రూపాయలు విరాళంగా ఇవ్వడం పూల్‌పాండియన్‌ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.

Next Story