- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బూర్గంపాడులో బీఆర్ఎస్ 'రథసారథి' ఉన్నట్లా... లేనట్లా...?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి.

దిశ,బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. నాయకుల మధ్య మనస్పర్ధలు,ఆధిపత్య పోరుతో గులాబీ దళం రెండుగా చీలిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు హడావుడి చేసిన నాయకులు... ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎండగట్టడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు బూర్గంపాడు మండలానికి బీఆర్ఎస్ రథసారథి ఉన్నట్లా... లేనట్లా...? అని సొంత పార్టీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి.
కేటీఆర్ బర్త్‌డే వేడుకల్లో 'గ్రూపు' రాజకీయాలు! ..
రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిన కార్యక్రమాలను సైతం బూర్గంపాడు అగ్రనేతలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.ఇటీవల నిర్వహించిన కేటీఆర్ జన్మదిన వేడుకలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.ఈ వేడుకలకు కేవలం జడ్పీటీసీ వర్గం మాత్రమే హాజరవ్వగా... మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి వర్గం పూర్తిగా దూరంగా ఉంది.నాయకుల తలోదిక్కు ధోరణితో, కిందిస్థాయి కార్యకర్తలు ఏ వైపు వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
'రేగా' మౌనం... పార్టీకి శాపం!
పార్టీని సమన్వయపరిచి సరైన మార్గంలో నడిపించాల్సిన మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు బూర్గంపాడు మండలంపై దృష్టి సారించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని స్థానిక నేతలు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కలిగిన అగ్రనేతలే ఉదాసీనంగా ఉండటంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది.
హస్తం గూటికి 'గులాబీ' నేతలు?
పార్టీలో ఐక్యత లేకపోవడం, భవిష్యత్తుపై ధీమా కనిపించకపోవడంతో బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు,కార్యకర్తలు అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన ఓ ముఖ్య నేత వివిధ పంచాయతీల్లోని బీఆర్ఎస్ నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.బీఆర్ఎస్ హయాంలో దళితబంధు,బీసీబంధు వంటి లబ్ధిపొందిన నాయకులు కూడా ఇప్పుడు పార్టీ పిలుపునకు స్పందించడం లేదని తెలుస్తోంది.నాయకుల మధ్యే స్పష్టత లేనప్పుడు తామెందుకు వేచి చూడాలని, త్వరలోనే భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.






