మద్యం మత్తులో వైద్యుడు.. ఏరియా ఆసుపత్రిలో కలకలం

by Ratna Kumari |

హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విధుల్లో ఉన్న ఓ వైద్యుడు మద్యం మత్తులో ఆసుపత్రికి వచ్చినట్లు ఆరోపణలు రావడంతో తీవ్ర కలకలం రేగింది.

మద్యం మత్తులో వైద్యుడు.. ఏరియా ఆసుపత్రిలో కలకలం
X

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విధుల్లో ఉన్న ఓ వైద్యుడు మద్యం మత్తులో ఆసుపత్రికి వచ్చినట్లు ఆరోపణలు రావడంతో తీవ్ర కలకలం రేగింది. అత్యవసర విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయన ప్రవర్తనపై రోగులు, వారి బంధువులు అభ్యంతరం వ్యక్తం చేయగా, పోలీసులు జోక్యం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అత్యవసర విభాగంలో కలకలం..

సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో అత్యవసర విభాగానికి వచ్చిన రోగులు, అక్కడ విధుల్లో ఉన్న రేడియాలజిస్ట్ వైద్యుడు మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. రోగులను సరిగా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బాధితులు, వారి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

బ్రీత్ అనలైజర్ పరీక్షకు నిరాకరణ..

సమాచారం అందుకున్న హుజురాబాద్ బ్లూ కోట్స్ పోలీసులు బ్రీత్ అనలైజర్ పరికరంతో ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే సదరు వైద్యుడు బ్రీత్ అనలైజర్ పరీక్షకు సహకరించలేదని సమాచారం. అనంతరం ఆసుపత్రి నుంచి కారులో వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

పోలీస్ స్టేషన్‌లోనూ సహకరించలేదని సమాచారం..

వైద్యుడు అనంతరం తన వాహనంతో హుజురాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు సమాచారం. అక్కడ కూడా పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నించగా ఆయన సహకరించలేదని తెలిసింది. ఈ ఘటనపై బాధితులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారించి తగిన శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్‌ను వివరణ కోసం సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదని సమాచారం. ఘటనపై పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుంచి అధికారిక వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Next Story