రోగితో ఎఫైర్.. డాక్టర్ సస్పెండ్

by Muthe.Rajitha |

బ్రిటన్‌లో ఓ మహిళా రోగితో ఎఫైర్ పెట్టుకోవడంతో భారత సంతతికి చెందిన ప్రముఖ డాక్టర్ సస్పెండ్ అయ్యారు.

రోగితో ఎఫైర్.. డాక్టర్ సస్పెండ్
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రిటన్‌లో ఓ మహిళా రోగితో ఎఫైర్ పెట్టుకోవడంతో భారత సంతతికి చెందిన ప్రముఖ డాక్టర్ సస్పెండ్ అయ్యారు. వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం, ప్రిస్క్రిప్షన్‌ లేకుండా ఆమెకు నొప్పి నివారణ మందులు ఇచ్చి, వాటిని కనీసం మెడికల్‌ రికార్డుల్లో నమోదు చేయకపోవడాన్ని బ్రిటన్ మెడికల్‌ కౌన్సిల్‌ తీవ్రంగా పరిగణించి, ఆ న్యూరో సర్జన్ పై 8 నెలల సస్పెన్షన్ వేటు వేసింది.

భారత సంతతికి చెందిన డాక్టర్‌ చిరాగ్‌ పటేల్‌ వేల్స్‌లోని ఒక ప్రసిద్ధ ఆసుపత్రిలో న్యూరోసర్జన్‌గా పనిచేస్తూ స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో, వెన్నునొప్పి సమస్యతో ఆసుపత్రికి వచ్చిన ఒక మహిళా రోగికి ఆయన 2019 నుండి 2021 మధ్యకాలంలో మూడుసార్లు శస్త్రచికిత్సలు చేశారు. ఈ చికిత్సల సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం చివరకు శారీరక సంబంధానికి దారితీసింది. ఆ సమయంలో ఆమెకు అవసరమైన ఔషధాలను అందించినప్పటికీ, నిబంధనల ప్రకారం వాటిని మెడికల్ రికార్డులలో నమోదు చేయకుండా డాక్టర్ పటేల్ నిర్లక్ష్యం వహించారు.

కొన్నేళ్ల పాటు సాగిన వీరి వ్యవహారం 2023లో విబేధాల కారణంగా ముగిసిపోయింది. ఆ తర్వాత సదరు మహిళ డాక్టర్‌ పటేల్‌పై పలు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ కేసులో క్రిమినల్ చర్యలు తీసుకోనప్పటికీ, ఈ మొత్తం ఉదంతాన్ని అక్కడి మెడికల్‌ బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రత్యేక ట్రైబ్యునల్‌ విచారణ చేపట్టగా.. డాక్టర్ చిరాగ్ పటేల్ విచారణలో తన తప్పును అంగీకరించారు. డాక్టర్ పటేల్ తన తప్పును ఒప్పుకుని పశ్చాత్తాపం వ్యక్తం చేయడాన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రైబ్యునల్ అధికారులు, ఆయన మెడికల్ ప్రాక్టీస్‌పై ఎనిమిది నెలల పాటు సస్పెన్షన్ విధిస్తున్నట్లు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story