- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
' అడవి సంరక్షణ చట్టాల పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకండి '
అడవి సంరక్షణ చట్టాల పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడవద్దని, అడవి ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలను ఆదుకోవాలని కోటపల్లి మండలం మాజీ జెడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పోటు రాంరెడ్డి కోరారు.

దిశ, చెన్నూర్ : అడవి సంరక్షణ చట్టాల పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడవద్దని, అడవి ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలను ఆదుకోవాలని కోటపల్లి మండలం మాజీ జెడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పోటు రాంరెడ్డి కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రెస్‌క్లబ్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ మారుమూల గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న రహదారి పనులకు అనుమతుల సడలింపు ఇవ్వాలని, చట్టాలను సవరించే విధంగా పార్టీలకతీతంగా అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు సహకరించాలని ఆయన కోరారు. అటవీ సంరక్షణ చట్టాల కింద అనుమతులు లభించక అనేక గ్రామీణ రహదారి ప్రాజెక్టులు సగం పనులతోనే నిలిచిపోయాయని అన్నారు.
రోడ్లు లేకపోవడంతో వేలాది మంది ప్రజలు అత్యవసర వైద్యం, విద్య, మార్కెట్ సౌకర్యాలకు దూరమవుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రజల సౌకర్యార్థం రహదారి కనెక్టివిటీ కల్పించిన అధికారుల పై శిక్షాత్మక చర్యలు తీసుకోవడం పరిపాలనా స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. మారుమూల, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక మినహాయింపులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం రోడ్ల నిర్మాణానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, అటవీ ప్రాంత ప్రజల సమానత్వం, గౌరవప్రదమైన జీవన హక్కుకు సంబంధించిన సమస్య అని అన్నారు. అడవి సంరక్షణ చట్టాల పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు చదువు కోసం వెళ్లాలన్నా రహదారి సౌకర్యాలు లేక చదువుకు దూరమవుతూ వారి భవిష్యత్తు అంధకారంలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






