- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ ఎఫెక్ట్.. బజార్‌హత్నూర్ పీహెచ్‌సీని డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ
“24 గంటల ఆసుపత్రిలో వైద్య సేవలు శూన్యం.. దవాఖానా బంద్‌కు సిద్ధం” అనే అంశంపై ఇటీవల ‘దిశ’ పత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) సాధన స్పందించారు.

దిశ, బజార్‌హత్నూర్: “24 గంటల ఆసుపత్రిలో వైద్య సేవలు శూన్యం.. దవాఖానా బంద్‌కు సిద్ధం” అనే అంశంపై ఇటీవల ‘దిశ’ పత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) సాధన స్పందించారు. గురువారం బజార్‌హత్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్‌సీ) ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న వైద్యులు, సిబ్బంది కొరత పై ఆరా తీశారు. రాత్రి వేళల్లో రోగులకు సరైన వైద్య సేవలు అందక పోవడం, సిబ్బంది లేకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సిబ్బంది హాజరు, రోగుల నమోదు పుస్తకాలు, ఇతర రికార్డులను పరిశీలించారు. వార్డులు, చికిత్స గదులు, ఔషధాల నిల్వలను తనిఖీ చేసి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
వైద్యులు, సిబ్బంది కొరత సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా ఖాళీలను భర్తీ చేసే చర్యలు చేపడతామని డీఎంహెచ్‌ఓ తెలిపారు. అప్పటి వరకు అందుబాటులో ఉన్న సిబ్బందితోనే తాత్కాలికంగా వైద్య సేవలను నిరంతరాయంగా కొనసాగించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా సేవాభావంతో పనిచేస్తూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు 24 గంటల వైద్య సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆసుపత్రి నిర్వహణ ఉండాలని, ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా చూడాలని ఆమె హెచ్చరించారు. ‘దిశ’ పత్రికలో వచ్చిన కథనంపై అధికారులు స్పందించి ఆసుపత్రిని సందర్శించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ, త్వరగా వైద్యులు మరియు సిబ్బంది నియామకం చేపట్టి పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సోనాల వైద్యాధికారి నవీన్ రెడ్డి, స్వప్న, హెచ్ఈవో సూర్య ప్రకాష్, సిబ్బంది ఉన్నారు.






