మత్తు పదార్థాలతో భవిష్యత్ అంధకారం:జిల్లా ఎస్పీ నితిక పంత్

by Jakkula.Mamatha |

మత్తు పదార్థాల వాడకం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని మాదకద్రవ్యాల వంటి వాటికి దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ నితికపంత్ అన్నారు.

మత్తు పదార్థాలతో  భవిష్యత్ అంధకారం:జిల్లా ఎస్పీ నితిక పంత్
X

దిశ, ఆసిఫాబాద్: మత్తు పదార్థాల వాడకం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని మాదకద్రవ్యాల వంటి వాటికి దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ నితికపంత్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాల దశ నుంచే విద్యార్థులు క్రమశిక్షణ మంచి విలువలు అలవర్చుకొని మాదకద్రవ్యాలు ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.

మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు సమాజాన్ని చైతన్య పరచాలన్నారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రజలందరూ స్వచ్ఛంద సంస్థలు, సమాజంలోని ప్రతి వర్గం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ 2K రన్ కార్యక్రమం ఆసిఫాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి గాంధీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌక్ నుండి తిరిగి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు కొనసాగింది. ఏఎస్పీ చిత్తరంజన్. డీఎస్పీ అశోక్, పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story