మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

by Ratna Kumari |

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అవంతిపురం గ్రామంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
X

దిశ, మిర్యాలగూడ రూరల్ : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అవంతిపురం గ్రామంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల (టిజిటిడబ్ల్యూఆర్ఎస్)లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ రూరల్ సీఐ పిఎన్డి ప్రసాద్, ఎస్‌హెచ్‌ఓ లక్ష్మయ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఏర్పడటమే కాకుండా కుటుంబాలు కూడా ఛిన్నాభిన్నం అవుతాయని వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. అలాగే ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం మాదక ద్రవ్యాల సేవనం, అక్రమ రవాణా, విక్రయం వంటి చర్యలు తీవ్రమైన నేరాలని, వాటికి కఠిన శిక్షలు విధిస్తారని అవగాహన కల్పించారు. అనంతరం "మత్తు పదార్థాలకు నో చెప్పండి", "డ్రగ్స్ వద్దు – జీవితం ముద్దు" అనే నినాదాలతో విద్యార్థులతో కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మాదక ద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story