కొల్లాపూర్‌లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

by Jakkula.Mamatha |

కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సోమవారం ఉదయం ఆకస్మికంగా పర్యటించారు.

కొల్లాపూర్‌లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
X

దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సోమవారం ఉదయం ఆకస్మికంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పట్టణ పారిశుద్ధ్య నిర్వహణ, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇతర అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. పలు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ పనుల పురోగతిని సమీక్షిస్తూ సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో భాగంగా ముందుగా పట్టణంలోని పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన కలెక్టర్, పరిశుభ్రత పనుల్లో నిమగ్నమైన పారిశుద్ధ్య కార్మికులతో నేరుగా మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితులు, పని పరిస్థితులు, సంక్షేమ చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కార్మికులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా, వారికి అవసరమైన భద్రతా పరికరాలు, గ్లోవ్స్, మాస్కులు, గౌన్లు తదితర రక్షణ సామగ్రి అందుబాటులో ఉన్నాయా అని అధికారులను ప్రశ్నించారు. విధుల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, సిబ్బంది కొరత, పరికరాల లభ్యత వంటి అంశాలపై కార్మికుల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యం గా తీసుకోవాలని, వారి భద్రతకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పట్టణంలో పరిశుభ్రత, పచ్చదనం, వ్యర్థాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.

పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు నాగమణి, వెంకట లక్ష్మయ్య, మౌనిక, శ్రీనివాస్‌లతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇళ్ల నిర్మాణం ఏ దశలో ఉందో, ప్రభుత్వం నుంచి దశలవారీగా విడుదలయ్యే ఆర్థిక సాయం సకాలంలో అందుతుందో లేదో తెలుసుకున్నారు. నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల అవుతున్నాయా, ఏదైనా బకాయిలు ఉన్నాయా, నిర్మాణ సామగ్రి సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయా అనే అంశాలపై లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించారు.

అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సహాయం పూర్తిస్థాయిలో అందేలా చూడాలని, పెండింగ్ బిల్లులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాలు నిర్దేశిత గడువులో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యటనలో భాగంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌ను కూడా కలెక్టర్ సందర్శించారు. కాంప్లెక్స్‌లోని దుకాణాల వినియోగం, అద్దె ద్వారా లభిస్తున్న ఆదాయం, నిర్వహణ వ్యవస్థ, ప్రజలకు అందుతున్న సేవల పై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మున్సిపాలిటీకి ఆదాయ వనరులు పెరిగేలా అందుబాటులో ఉన్న వాణిజ్య స్థలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట కొల్లాపూర్ ఆర్డిఓ బన్సీలాల్, కొల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి జ్యోతి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రహీం పాషా, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు .

Next Story