RTE కింద EWS అడ్మిషన్ల నిరాకరణ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు

by Kema Shiva Kumar |

ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్లు నిరాకరిస్తున్నారనే పిల్‌పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది.

RTE కింద EWS అడ్మిషన్ల నిరాకరణ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) విద్యార్థులకు ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం (RTE) కింద ప్రవేశాలు కల్పించడంలో వైఫల్యాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పంజాబ్‌లోని పలు గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు 25 శాతం సీట్లను EWS వర్గాలకు కేటాయించాలనే చట్టం ఉన్నప్పటికీ ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ.. అర్హులైన విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరిస్తున్నాయని దాఖలైన పిల్‌పై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం కీలక నోటీసులు జారీ చేసింది.

ప్రాథమిక హక్కుల కాలరాతే ఇది..

చట్ట ప్రకారం ప్రతీ ప్రైవేటు పాఠశాలలో వెనుకబడిన వర్గాల పిల్లల కోసం సీట్లను కేటాయించాల్సి ఉండగా.. పంజాబ్‌లోని విద్యా సంస్థలు నిరంతరం నియమాలను ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ కోర్టు తెలిపారు. స్కూళ్ల నిర్వాహకులు విద్యా హక్కు చట్టాన్ని నీరుగార్చడమే కాకుండా, బాలల ప్రాథమిక హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసులో పూర్తి వాదనలు విన్న ధర్మాసనం.. కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించాలని తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని ప్రైవేటు పాఠశాలలు విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తున్నాయి? ఎంతమంది విద్యార్థులకు ప్రవేశాలు నిరాకరించారు? అనే పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సిద్ధం చేసి తమకు సమర్పించాలని పిటిషనర్‌కు సుప్రీం ధర్మాసనం సూచనలు చేస్తూ నోటీసులు జారీ చేసింది.

Next Story