దేశంలోని చమురు సంస్థలకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ నష్టాలు

by Kema Shiva Kumar |

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో తీవ్ర నష్టాల్లో ఉన్న భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు ఊహించని రీతిలో భారీ ఉపశమనం లభించింది.

దేశంలోని చమురు సంస్థలకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ నష్టాలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) లకు బిగ్ రిలీఫ్ లభించింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు, దేశీయ అమ్మకపు ధరలకు మధ్య వ్యత్యాసం వల్ల గత కొన్ని నెలలుగా ఈ సంస్థలు ఎదుర్కొంటున్న రోజువారీ నష్టాలు మే నెల ముగిసే నాటికి భారీగా తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ప్రభుత్వ వ్యూహాత్మక జోక్యం, మే నెలలో తీసుకున్న ధరల సవరణ నిర్ణయాలు అందుకు బిగ్ బూస్ట్‌ను ఇచ్చాయి.

సింగిల్ డిజిట్‌కు పెట్రోల్ నష్టాలు..

ఏప్రిల్ 1 నాటి గరిష్ట స్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం చమురు సంస్థల నష్టాల భారం చాలా వరకు తగ్గినట్లుగా లెటెస్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. గతంలో లీటరుకు రూ.24లుగా ఉన్న అండర్ రికవరీ, ఇప్పుడు ఏకంగా 83 శాతం తగ్గి రూ.3కి చేరింది. ఇక డీజిల్‌పై గతంలో లీటరుకు రూ.105 లుగా ఉన్న నష్టం, ప్రస్తుతం 75 శాతం తగ్గి రూ.27కి పడిపోయింది. మే నెల ప్రారంభంలో రోజుకు రూ.750 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు ఉన్న ఓఎంసీల మొత్తం నష్టాలు, మే చివరి నాటికి రోజుకు రూ.600 కోట్లకు తగ్గట విశేషం. అయితే, అంతర్జాతీయ ముడిచమురు ధరల ఒత్తిడిని తట్టుకోవడానికి మే నెలలో చమురు సంస్థలు 4 విడతలుగా ఇంధన ధరలను రూ.2.7 కి పైగా పెంచాయి. ఆ ఒకే ఒక్క నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.94.77 నుంచి ₹102.12కి, డీజిల్ ధర రూ.87.67 నుంచి రూ.95.20కి చేరింది. ఆ ధరల పెంపు వల్లే ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు 44 శాతం వరకు తగ్గాయి.

ప్రభుత్వ ఎక్సైజ్ సుంకం తగ్గింపు..

ధరల భారం మొత్తం వినియోగదారులపై పడకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 78 రోజుల వ్యవధిలో ఎక్సైజ్ సుంకాల (Excise Duties)ను తగ్గించింది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.1.23 లక్షల కోట్ల ఆదాయాన్ని స్వచ్ఛందం వదులుకుంది. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి నుంచి రవాణా అడ్డంకుల వల్ల ఒకానొక దశలో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగి చర్చల వైపు మళ్లడంతో బ్రెంట్ క్రూడ్ ధర తిరిగి బ్యారెల్‌కు రూ.94 డాలర్ల మార్కుకు దిగివచ్చింది. దీంతో భారత్‌లో మరికొన్ని రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గే అవకాశం ఉందని బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక పెట్రోల్‌పై నష్టాలు సింగిల్ డిజిట్‌కు చేరడంతో ఫస్ట్ క్వార్టర్‌లో ఓఎంసీలు ఎదుర్కోవాల్సిన భారీ నష్టాల ముప్పు తప్పినట్లైంది. తాజా పరిణామాలతో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో ఎనర్జీ రంగానికి చెందిన చమురు సంస్థల షేర్లు తిరిగి లాభాల బాట పట్టాయి.

Next Story