- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీలింగ్ భూమి కబ్జా పై అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు
పేదలకు చెందాల్సిన ప్రభుత్వ సీలింగ్ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాలవుతున్నాయి.

దిశ, ఆలేరు : పేదలకు చెందాల్సిన ప్రభుత్వ సీలింగ్ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాలవుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, అధికారుల కళ్ళు గప్పి ఏకంగా ఎకరాల కొద్దీ ప్రభుత్వ సీలింగ్ భూమిని కబ్జా చేసి కమర్షియల్ వెంచర్లుగా మార్చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో వెలుగుచూసిన ఈ భారీ భూ కుంభకోణం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గ్రీవెన్స్‌కు చేరిన ‘స్విస్ లైఫ్’ అక్రమాలు..
కొలనుపాక గ్రామంలోని సర్వేనెంబర్ 425 లో ఉన్న 5.36 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని "స్వీస్ లైఫ్ టౌన్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్" అనే రియల్ ఎస్టేట్ సంస్థ అక్రమంగా కబ్జా చేసి ఆక్రమించింది. ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ భూమిని సైతం తమ సొంత ల్యాండ్ లాగా చూపిస్తూ అక్కడ పెద్ద ఎత్తున వెంచర్ ఏర్పాటు చేసింది. అదే విధంగా వెంచర్ చుట్టూ భారీ ప్రహరీని నిర్మించిన ఈ అక్రమ వెంచర్ పై సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి (గ్రీవెన్స్) లో ఆలేరు పట్టణానికి చెందిన ఒక సామాజిక కార్యకర్త జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డికి ఫిర్యాదు చేశాడు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సీలింగ్ భూమిని ప్రైవేట్ సంస్థ హస్తగతం చేసుకుంటున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే స్పందించి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని ఆయన రెవెన్యూ అదనపు కలెక్టర్ ను కోరారు.
విచారణకు ఆదేశం !
ఫిర్యాదు పై తక్షణమే స్పందించిన జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి ఈ భూ కబ్జా వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీని పై సమగ్ర విచారణ జరపాల్సిందిగా ఆలేరు తహసీల్దార్ ఆంజనేయులును ఆదేశించారు. సర్వే నెంబర్ 425లోని భూముల ప్రస్తుత పరిస్థితి ఏమిటి ? స్వీస్ లైఫ్ టౌన్ షిప్ సంస్థకు ఆ భూమితో ఉన్న సంబంధం ఏంటి ? అది ప్రభుత్వ సీలింగ్ భూమేనా కాదా ? అనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి, సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
అధికారుల పాత్ర పై అనుమానాలు ?
ఇంత పెద్ద ఎత్తున, దాదాపు ఐదున్నర ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిలో వెంచర్ పనులు జరుగుతుంటే స్థానిక రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థకు, కొంతమంది అధికారులకు మధ్య లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్లాట్లు చేసి అమాయక ప్రజలకు అంటగట్టి కోట్ల రూపాయలు వెనకేసుకోవాలని చూస్తున్న 'స్వీస్ లైఫ్' సంస్థ పై కఠిన చర్యలు తీసుకొని సీలింగ్ భూమిని రెవెన్యూ అధికారులు వెంటనే స్వాధీనం చేసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.






