ఆ గ్రామాలు ఎటువైపు.. మళ్లీ చర్చలోకి సరిహద్దు గ్రామాలు

by Batti.Sumithra |

తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని వివాదాస్పద గ్రామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

ఆ గ్రామాలు ఎటువైపు.. మళ్లీ చర్చలోకి సరిహద్దు గ్రామాలు
X

దిశ, ఆసిఫాబాద్ : తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని వివాదాస్పద గ్రామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సర్వే ప్రక్రియలో భాగంగా సరిహద్దులోని పరంధోళి, కోట, లెండిగూడ, పరంధోళి తండా, శంకర్ లొద్ది, ముకద్దంగూడ గ్రామాలకు వెళ్లిన సర్వే అధికారులకు గ్రామస్తుల నుంచి చుక్కెదురైంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తమకు వర్తించడం లేదని, పంట రుణాలు, భూమి పట్టాలు ఇవ్వడం లేదని పేర్కొంటూ అధికారులు అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించేందుకు గ్రామస్తులు నిరాకరించారు. అధికారులు పలుమార్లు గ్రామాలకు వెళ్లి గ్రామస్తులతో చర్చలు జరిపినా వారు వినిపించుకోలేదు. ప్రభుత్వం పట్ల అసంతృప్తితో తాజాగా మంగళవారం ఆయా గ్రామాల ప్రతినిధులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి భూ హక్కులు కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. తాము మహారాష్ట్రలోనే కొనసాగాలని కోరడంతో ఈ అంశం మరోసారి చర్చకు దారితీసింది.

1987లో ప్రారంభమైన వివాదం..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల పరిధిలోని పరంధోళి, ముకద్దంగూడ, మహారాజ్‌గూడ, కోట, అంతాపూర్, ఇంద్రపూర్, ఏసాపూర్, నారాయణగూడ, బోలాపటార్, గౌరీ, లెండిగూడ, పద్మావతి గ్రామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండేవి. అయితే భౌగోళిక, సాంస్కృతిక కారణాలను చూపుతూ 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాలను చంద్రపూర్ జిల్లా జివతి తాలూకాలో చేర్చడంతో వివాదం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ గ్రామాల్లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. గ్రామాలకు ఇద్దరు సర్పంచులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రాతినిధ్యం కొనసాగుతోంది. అంతేకాకుండా, ఈ గ్రామాల ఓటర్లు రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లోనూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఈ సరిహద్దు వివాదం పరిష్కారం కోసం అప్పట్లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి కేకే నాయుడు కమిషన్‌ను ఏర్పాటు చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 12 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కే చెందినవని పేర్కొంది. అయితే దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేసు ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. గత ఏడాది ఈ గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులతో వ్యాఖ్యానించడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు మళ్లీ గ్రామస్తులు మహారాష్ట్ర సీఎంను కలిసి వినతిపత్రం అందజేయడంతో ఈ అంశం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.

1956కు ముందే మా గ్రామాలు మహారాష్ట్రలోనే ఉన్నాయి.. సామాజిక కార్యకర్త రణ్‌వీర్ రాందాస్

1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్విభజనకు ముందే తమ గ్రామాలు మహారాష్ట్రలోనే ఉన్నాయని సామాజిక కార్యకర్త రణ్‌వీర్ రాందాస్ తెలిపారు. మరాఠీ మాట్లాడే తామంతా భాషా ప్రాతిపదికన మహారాష్ట్రలోనే కొనసాగేందుకు ఆసక్తి చూపుతున్నామని చెప్పారు. ప్రస్తుతం తాము సాగు చేస్తున్న భూములు తెలంగాణలో కాకుండా సరిహద్దు వివాదంలో చిక్కుకున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి భూ సర్వే నిర్వహించి, భూ హక్కు పత్రాలు అందజేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

Next Story